calender_icon.png 5 December, 2024 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ సూసైడ్‌శాలలు!

05-12-2024 12:36:43 AM

  1. చదువుల పేరుతో విద్యార్థులకు ప్రత్యక్ష నరకం 
  2. రోజుకు 15 గంటలపాటు తరగతులు, స్టడీ అవర్స్
  3. ఒత్తిడి భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు
  4. అయినా స్పందించని ప్రభుత్వం

* మదీనాగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ సంగ్యపు శివతేజ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు వెంటనే తన తల్లిదండ్రులకు విషయం తెలియపరిచింది. శివతేజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఘట్‌కేసర్‌లోని పోచారం మున్సిపాలిటీలోని నారాయణ కాలేజీ మొదటి సంవత్సర విద్యార్థి బానోత్ ధనుశ్ నాయక్(16) చదువుల ఒత్తిడి భరించలేక ఇటీవల క్యాంపస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి నారాయణ కాలేజీ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని అనూష చదువుల ఒత్తిడి భరించలేక తరగతి గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

బొల్లారం నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని వైష్ణవి హాస్టల్‌లో ఉరి వేసుకుని తనువు చాలించింది. ఇలా నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు.

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శ్రీచైతన్య, నారాయణ వంటి  కార్పొరేట్ కాలేజీ ల్లో విద్యార్థుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వందేళ్ల భవిష్యత్తు చూడాల్సిన వారు చిరుప్రాయంలోనే తనువులు చాలిస్తున్నారు. యాజామాన్యాలు ర్యాంకుల ఒత్తిడి తో విద్యార్థులను ప్రతి రోజు 15 గంటల పాటు చదివిస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఆయా కాలేజీల్లోని టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వాటిని భరించలేక విద్యార్థులు బలవన్మరణాకు పాల్పడుతున్నారు. తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. కానీ, పిల్లల ప్రాణం మీదకు చదువులు వచ్చాయనే అంశాన్ని వారు గుర్తించడం లేదు. గడిచిన వారం రోజుల్లో హైదరాబాద్ పరిధిలోని శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి  ఏ విధంగా ఉందో అర్థం చేసుకొవచ్చు. మరో ఇద్దరు బాలికలు తమను లెక్చరర్లు లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రూ.లక్షల ఫీజులు కట్టి మరీ విద్యార్థులు టార్చర్ అనుభవిస్తుండడం గమనార్హం. 

చదువులు ఇలా..

హాస్టళ్లలో సిబ్బంది ఉదయం 4 గంటలకే విద్యార్థులను నిద్రలేపుతారు. ఉదయమంతా యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తాయి. తర్వాత రాత్రి 11గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తాయి. ఈ ఒత్తిడిలో ఒక విద్యార్థి కనీసం తోటి విద్యార్థులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.

ఆపై విద్యార్థికి మార్కులు సరిగా రాకపోతే తోటి విద్యార్థుల ముందే అధ్యాపకులు హేళన చేసి మాట్లాడడం, తల్లిదండ్రులకు కాల్ చేసి ‘మీ పిల్లలు చదవట్లేదు. ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నా యి’ అని చెప్తుండటంతో విద్యార్థులు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్సుకు గురవుతున్నారు. 

విద్యార్థినులపై లైంగిక వేధింపులు..

కార్పొరేట్ కాలేజీల్లో  పాఠాలు చెప్తున్న అధ్యాపకులు కొందరు కీచకులుగా మారుతున్నారు. విద్యార్థినుల ఫోన్ నంబర్లు సేకరించి, వారిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మార్కులు ఎక్కువగా రావాలం టే తమతో చనువుగా ఉండాలని, లేకపోతే తక్కువ మార్కులు వేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ లోని పలు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులు నేరుగా పోలీస్‌స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నా యి.  ఆయా కాలేజీలపై విద్యాశాఖ నామమత్రంగానైనా చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలు పోతున్నా  స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.