calender_icon.png 2 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ ఆఫర్లు!

01-04-2025 12:48:56 AM

  1. టెన్త్ విద్యార్థుల కోసం ఇంటింటికీ జూనియర్ కాలేజీల పీఆర్వోలు
  2. ముందే అడ్మిషన్ తీసుకుంటే రాయితీలంటూ బేరాలు

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఇంటర్ అడ్మిషన్ల దందా జోరుగా సాగుతోంది. ఇంకా పదో తరగతి పరీక్షలు పూర్తి కాకముందే ఆయా కాలేజీలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. అకడామిక్ ప్రారం భానికి రెండు నెలల ముందు నుంచే అడ్మిషన్లు ప్రారంభించడం గమనార్హం. పదో తరగతి పరీక్షలు పూర్తి కావొస్తుండటంతో దందాలో వేగం పెంచాయి.

స్కూళ్ల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను సేకరించి వారిని సంప్రదిస్తున్నారు. హలో సార్ మేము ఫలానా కాలేజీ నుంచి మా ట్లాడుతున్నామంటూ ఫోన్లు చేసి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నేరుగా ఇంటికెళ్లి మరీ ఫీజు విషయంలో బేరసారాలు ఆడుతున్నారు. ముందస్తు అడ్మిషన్ తీసుకుంటే ఒక ఫీజు.. తర్వాత తీసుకుంటే మరో ఫీజు..

ఇప్పుడు త్వరపడకుంటే తర్వాత అసలు సీటు లభిస్తుందో లేదో కూడా చెప్పడం కష్టమని మభ్యపెడుతున్నారు. పేరెంట్స్ బలహీనతను ఆసరా చేసుకొని 2025 26 విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు నుంచే అడ్మిషన్లు చేపడుతున్నారు. ముందే అడ్మిషన్లు తీసుకుంటే.. ఫీజులో రాయితీ ఉంటుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు.

ఇంటర్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటే ఈ ఫీజు నుంచి డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. పేరుమోసిన కాలేజీల్లోనైతే దీనికి అదనంగా ఒకట్రెండు లక్షలు ఎక్కువే వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. 

నిబంధనలకు పాతర..

రాష్ట్రంలో 200లకు పైగా కార్పొరేట్ జూనియర్ కాలేజీలున్నాయి. ఇంటర్ బోర్డు అడ్మిషన్లకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది. షెడ్యూల్ విడుదలకు ముందే కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు నిబంధనలున్నాయి. ఇదంతా ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుమారు 5 లక్షల విద్యార్థులు  పరీక్షలకు హాజరవుతున్నారు. ఒకవైపు పరీక్షలు జరుగుతుంటే మరోవైపు కార్పొరేట్ కాలేజీలు మాత్రం అడ్మిషన్ల దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాస్తు న్న విద్యార్థుల ఇంటికి కాలేజీల నుంచి పీఆర్‌వోలు వచ్చి తమ కాలేజీలోనే అడ్మిషన్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఒక్కో విద్యార్థి ఇంటికి ఐదు- పది కాలేజీల పీఆర్‌వోలు చక్కర్లు కొడుతున్నారు. జేఈఈ, నీట్, ఎప్‌సెట్‌లో స్పెషల్ కోచింగ్ అంటూ పేరెంట్స్‌కు ఎరవేస్తున్నారు. పీఆర్‌వోలకు ఆయా కాలేజీలు టార్గెట్‌ను నిర్ధేశిస్తున్నాయి.  

అడ్మిషన్లు ఫుల్..

ఇంటర్ అకాడమిక్ ఇయర్.. జూన్ 1న మొదలై, మార్చిలో ముగుస్తుంది. గతేడాది దసరా నుంచే అడ్మిషన్ల దందాను కార్పొరేట్ కాలేజీలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80 శా తం అడ్మిషన్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఒకవేళ అడ్మిషన్లు కాకున్నా.. మనం కోరి వెళ్లే కాలేజీల్లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని, సీ ట్లు లేవని బదులిస్తారు.

కార్పొరేట్ కాలేజీలే కృత్రిమ కొరతను సృష్టించి.. చివరికి సీట్లు కేటాయిస్తున్నారు. సీటు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరితే ఎక్కువ ఫీజు కట్టాల్సి వస్తుందంటున్నారు. చేసేదిలేక అడిగిన కాడికి చెల్లిస్తున్నారు.