calender_icon.png 22 November, 2024 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం

22-11-2024 02:12:39 AM

౩౦ కిలోమీటర్లకో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు

ఉత్తర తెలంగాణకు నాలుగు క్యాన్సర్ హాస్పిటల్స్

మంచిర్యాల జిల్లాలో ఒకటి ఏర్పాటు చేస్తాం

వైద్యారోగ్యశాఖలో అవసరమైన సిబ్బంది నియమిస్తాం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన

మంచిర్యాల, నవంబర్ 21 (విజయక్రాంతి): ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండా 90 శాతం మందికి జిల్లాల్లోనే కార్పొరేటు స్థాయి ఉచిత వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలో ౭ వేల మంది వైద్య సిబ్బందిని నియమించామని తెలిపారు. ౩ వేల జనాభా ఉన్న గిరిజన ప్రాంతాల్లో, ౫ వేల జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సబ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అత్యవసర సేవలు మరింత వేగంగా అందేందుకు గిరిజన ప్రాంతాల్లో రెండు, మండలానికి ఒక అంబులెన్సు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.300 కోట్లతో మంజూరైన ౬౫౦ పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ బొర్కడేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి దామోదర మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 74 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని తెలిపారు.

జిల్లాల్లో ఉన్న డయాలసిస్ కేంద్రాల్లో పది బెడ్ల నుంచి 30 బెడ్లకు అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర తెలంగాణకు నాలుగు క్యాన్సర్ కేంద్రాలు మంజూరయ్యాయని, మంచిర్యాలకు ఒక కేంద్రం వస్తుందని పేర్కొన్నారు. అలాగే వ్యాస్కిల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగిని పరిక్షించడమే బాధ్యతగా భావించి వైద్యం అందించేలా వైద్యులను, సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరు పడకల నుంచి 30 పడకలకు అప్‌గ్రేడ్ చేసి వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 29 సబ్ సెంటర్లు అవసరమని గుర్తించామని, పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట పీహెచ్‌సీ, చెన్నూర్ నియోజకవర్గంలోని అంగ్రాజుపల్లి పీహెచ్‌సీలలో 24 గంటల వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు. వైద్య సిబ్బందిని పెంచి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం అహర్నిశలు కృషిచేస్తామని అన్నారు.  

ఏడు నియోజకవర్గాల ప్రజలకు వైద్యసేవలు : మంత్రి శ్రీధర్‌బాబు

మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఏడు నియోజక వర్గాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచి తంగా అందుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. రూ.300 కోట్లతో 225 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం, 425 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని చెప్పా రు. వైద్యం అంటేనే సామాన్యులు భయపడకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించడ మే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

గత ప్రభు త్వం మాదిరి జీవోలకే పరిమితం కాకుండా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని స్పష్టంచేశారు. ఏడాదిలోనే ప్రజలకు ప్రభుత్వం ఇచ్చి న హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్, ఢిల్లీ లో ఉండే ఆసుపత్రులను తలదన్నేలా మంచిర్యాల ఆసుపత్రి నిర్మాణం, సేవలు ఉండను న్నాయని, అందుకు అవసరమైన అన్ని వనరులు సమకూర్చుతున్నామని తెలిపారు.

మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కరకట్టల నిర్మాణానికి రూ.260 కోట్లు మంజూరయ్యాయని, రూ.40 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ఎన్‌ఆర్‌ఈజీఎస్ స్పెషల్ డెవలఫ్‌మెంటు ఫండ్‌తో అంతర్గత రహదారులు నిర్మించి గ్రా మాల నుంచి మండలాలకు అనుసంధానం, ఇండస్ట్రీయల్ హబ్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు నిధులు తెప్పించుకొని ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్ రావు కృషి చేస్తున్నారని అభినందించారు.

జిల్లాలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పా టు చేశారని వెల్లడించారు. బీఆర్‌ఎస్, బీజేపీ పాలనలో జరిగిందేమి లేదని విమర్శించారు. వసతి గృహ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచామని, రైతులకు రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు మాఫీ కింద అందించామని ఉద్ఘాటించారు. సింగరేణి కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు బోనస్ అందించామని తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో మూడు పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మినిమమ్ వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, కలెక్టర్ కుమార్ యాద వ్, రామగుండం సీపీ శ్రీనివాసులు, డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ సులేమాన్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంటు హరిశ్చంద్ర, మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పల య్య, సురిమిల్ల వేణు పాల్గొన్నారు.