calender_icon.png 30 September, 2024 | 9:00 AM

వారసుడికి పట్టాభిషేకం

30-09-2024 12:00:00 AM

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి బాధ్యతలు

మరో నలుగురు మంత్రుల ప్రమాణస్వీకారం

చెన్నై, సెప్టెంబర్ 29: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీ కరణలో భాగంగా మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గోవి చెళియన్, నాజర్, రాజేంద్రన్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి రెండ్రోజుల కింద బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ మళ్లీ మంత్రిగా ప్రమాణం చేశారు. మనో తంగరాజ్, మస్తాన్, రామచంద్రన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. 

సినిమా నేపథ్యం నుంచి..

ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మళ్లీ ప్రమాణం చేయలేదు. కార్యక్రమానికి బయలుదేరే ముందు మాట్లాడుతూ.. ఇది తనకు పదవి కాదని, పెద్ద బాధ్యతని చెప్పారు. 1997 నవంబర్ 27న జన్మించిన ఉదయనిధి.. డిగ్రీ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు.

నిర్మాత, నటుడిగా గుర్తింపు పొందారు. మురసోలీ పత్రిక బాధ్యతలు సైతం నిర్వహించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో యూత్ వింగ్ కార్యదర్శిగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో చురుకుగా వ్యవహరించారు. కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

మరోవైపు రాజకీయాల్లో తండ్రి స్టాలిన్ బాటలోనే పయనిస్తున్నారు. కరుణానిధి ప్రభుత్వంలో స్టాలిన్ తొలుత డిప్యూటీ సీఎంగా పనిచేసినట్లుగానే ఇప్పుడు ఉదయనిధి ఉపముఖ్యమంత్రి అయ్యారు. కానీ, స్టాలిన్‌కు మాత్రం ఈ అవకాశం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి చెన్నై మేయర్‌గా పనిచేసిన తర్వాత దక్కింది. కానీ, ఉదయనిధికి తొందరగానే డిప్యూటీ సీఎం అయ్యారు.