22-04-2025 08:37:03 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటి చేను గ్రామంలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ పోలీసు బలగాలతో ఉదయం 6 గంటలకు ఆ గ్రామాన్ని ఆకస్మికంగా చుట్టుముట్టారు. ప్రతి ఇంటిని నిర్బంధంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా? అని ఆరా తీశారు. ఇలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 26 వెహికల్స్, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని రెండు వాహనాలను సీజ్ చేశారు.
కాసిపేట, మందమర్రి, రామకృష్ణాపూర్, దేవపూర్ ఎస్ఐ లు, పోలీసు బలగాలతో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (కార్డెన్ అండ్ సెర్చ్) గ్రామీణ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేకెత్తించింది. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటున్నారా! అపరచిత వ్యక్తులకి ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా..? అనే కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డ్ పరిశీలించారు. స్థానికుల ద్విచక్ర వాహనాలు, ఆటోల ఆర్సి, ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లు చెక్ చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి స్థానిక ప్రజలకు సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కోత్త చట్టాలపై అవగాహన కల్పించారు.
మూఢ నమ్మకాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని ట్రాఫిక్ నిబంధన లను గురించి వివరించారు. కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న దుర్గం సూర్య ప్రకాష్, రామటెంకి అర్జున్ లను పట్టుకున్నారు. వారి పైన ఎక్సైజ్ కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి, కాసిపేట, దేవాపూర్, రామకృష్ణాపూర్, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.