calender_icon.png 8 November, 2024 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కార్యకలాపాల నియంత్రణకే కార్డెన్ అండ్ సర్చ్

31-08-2024 01:56:21 PM

... డి.ఎస్.పి కరుణాకర్

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకే కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని డిఎస్పి కరుణాకర్ తెలిపారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని   బట్ పల్లి చౌరస్తా, కాపు వాడ కాలనీలలో  90 మంది పోలీస్ సిబ్బందితో  కలసి మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ... ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటున్నారా లేదా, అపరచిత వ్యక్తులకు ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ , గుర్తింపు కార్డ్ లను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసించే వారి ద్విచక్ర వాహనాలు , ఆటోల ఆర్ సి,  ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించి ద్రువపత్రాలు లేని, నెంబర్ ప్లేట్ లేని 100 ద్విచక్ర వాహనాలు, 3ఆటో లను  సీజ్ చేసినట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరు వాహనానికి సంబంధించి పేపర్లు , డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా ఉండాలని, నేరాలకు పాల్పడేవారు గుర్తుతెలియని వాహనాలను ఉపయోగిస్తారు కాబట్టి నెంబర్ ప్లేట్ , సరియైన పత్రాలు లేని వాహనాలు పైన కేసులు బుక్ చేయడం జరుగుతుందన్నారు. వర్తక వ్యాపారస్తులు తప్పనిసరిగా వారి షాపు ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వాటి ద్వారా నేరాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని తెలిపారు. సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కోత్త చట్టాలు,  మూఢ నమ్మకాల పై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడిన, భూమి సంబంధిత గొడవల్లో పాల్గొన్న,అమాయకులను మోసం చేసిన వారిపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే గాక అట్టి వ్యక్తులపై రౌడీ షీట్ తెరువడం జరుగుతుందన్నారు.

వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని  ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. గంజాయి , మత్తు పదార్థాలకు వ్యసనం కావడం వల్ల జరిగే అనార్థాలపై వాటిని  అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై  అవగాహన కల్పించారు.. ఎవరైనా గంజాయి , నిషేధిత మత్తు పదార్థాలను సాగుచేసిన, రవాణా చేసిన, విక్రయించిన వారి యొక్క వివరాలను పోలీసు వారికి తెలియజేయాలని వివరాలు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచబడుతుందన్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరా గాళ్ళ ఉచ్చులో పడుతున్నారని సైబర్ నేరానికి గురైన వారు వెంటనే 1930 కాల్ చేసి వివరాలు తెలిపితే బాధితుల యొక్క సొమ్మును వీలైనంతవరకు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణం లో పండుగను జరుపుకునేలా సహకరించాలని కోరారు.ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలను చేయాలని ప్రయత్నించినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  సిఐలు శంకరయ్య, సత్యనారాయణ, రమేష్, శ్రీనివాస్, కాగజ నగర్ సబ్ డివిజస్ లోని ఎస్సైలు, స్పెషల్ పార్టీ ఫోర్స్ ,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.