calender_icon.png 4 October, 2024 | 7:03 AM

విద్యార్థులకు రాగి జావ

04-10-2024 02:44:49 AM

  1. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కొక్కరికీ 10 గ్రా. రాగి పౌడర్, 10 గ్రా. బెల్లం

వారానికి మూడు రోజులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వారానికి మూడు రోజులు ఫోర్టిఫైడ్ రాగిజావను అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌తో కలిసి అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాగిజావను అందించనున్నారు.

వారంలో మూడు రోజులు విద్యార్థులకు ఉడికించిన కోడిగుడ్లను అందజేస్తుండగా, మిగతా మూడు రోజుల్లో ఈ రాగిజావను అందజేస్తారు. శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఫోర్టిఫైడ్ రాగి పౌడర్, బెల్లంపొడిని అందిస్తుంది. మధ్యాహ్న భోజన కుక్‌కమ్ హెల్పర్ల ద్వారా జావను మంచిగా తయారుచేయించి అందించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగి పౌడర్, 10 గ్రాముల బెల్లం ముడిసరుకు రూపంలో ఇస్తారు. మండల కేంద్రాల్లో ఈ ముడిసరులను అందజేస్తారు. వీటిని పాఠశాల పాయింట్లకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలోనూ శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌తో కలిసి రాగిజావను అందజేయగా, ఈ విద్యాసంవత్సరం సైతం అందజేసేందుకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.