calender_icon.png 23 December, 2024 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోపా చాంప్ అర్జెంటీనా

16-07-2024 01:27:55 AM

ఫైనల్లో కొలంబియాపై గెలుపు ఘన విజయం 

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ఫుట్‌బాల్ టోర్నీలో అర్జెంటీనా అదరగొట్టింది. కోపా అమెరికా కప్ ఫైనల్లో కొలంబియాను చిత్తుచేసిన అర్జెంటీనా రికార్డు స్థాయిలో 16వ సారి ట్రోపీ కైవసం చేసుకుంది. టోర్నీ ఆసాంతం ఎదురులేకుండా సాగిన అర్జెంటీనా.. తుదిపోరులోనూ అదే దూకుడు కనబర్చగా.. 23 ఏండ్ల తర్వాత ఫైనల్ చేరిన కొలంబియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

మియామి గార్డెన్స్: స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ గాయపడి మైదానం వీడినా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు గ్రౌండ్‌లో చెలరేగిపోయింది. సోమవారం జరిగిన ప్రతిష్ఠాత్మక కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా 1 కొలంబియాపై విజయం సాధించింది. అర్జెంటీనాకు ఇది 16వ కోపా అమెరికా ట్రోఫీ కాగా.. కొలంబియా 28 వరస విజయాల జైత్రయాత్రకు చెక్ పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగిపోయింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను అర్జెంటీనా స్ట్రయికర్ మార్టినేజ్ (112వ నిమిషంలో) సాధించాడు. అభిమానుల రసాభాసతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఇరు జట్లు దూకుడుగానే ఆట ఆరంభించాయి.

అయితే ఇరు జట్ల రక్షణ శ్రేణులు అడ్డుగోడలుగా నిలవడంతో తొలి అర్ధభాగంలో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్థంలో కాలి గాయం కారణంగా అర్జెంటీనా స్టార్ మెస్సీ మైదానం వీడగా.. ద్వితీయార్థంలోనూ ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫలితం తేల్చేందుకు అదనపు సమయాన్ని కేటాయించగా.. ఇందులో మార్టినేజ్ మెరుపు గోల్‌తో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. మ్యాచ్‌లో కొలంబియా పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు కొనసాగించింది.

మొత్తంగా కొలంబియా 19 షాట్స్ ఆడగా.. అర్జెంటీనా 11 షాట్స్ కొట్టింది. అర్జెంటీనాకు ఇది వరుసగా మూడో మేజర్ టైటిల్ కావడం విశేషం. 2021లో కోపా కప్ నెగ్గిన ఆ జట్టు.. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. ట్రోఫీ నెగ్గిన సమయంలో డగౌట్‌లో ఉన్న 37 ఏళ్ల మెస్సీ కన్నీటి పర్యంతంకాగా.. ఈ ఆనంద సమయంలో అర్జెంటీనా సీనియర్ ఆటగాళ్లు డి మారియా, నికోలస్ ఒట్టమండి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు.