26-02-2025 12:47:21 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : పేదలకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని మాతశిశు సంరక్షణ కేంద్రం, ఇతర విభాగాలు ఆమె తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది కొన్నికేసుల్లో డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, ప్రభుత్వ దవాఖానలో జరుగుతున్న ఘటనలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా డాక్టర్లు, సిబ్బందిని వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
దేవరకొండలో ఇలాంటి ఘటనలే జరిగితే కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా ఫర్నిచర్ ధ్వంసం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు. వారి వెంట డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ మాతృనాయక్, సూపరింటెండెంట్ అరుణశ్రీ, డాక్టర్లు తదితరులున్నారు.