అంతర్జాతీయంగా టన్నుపై 100 డాలర్లు క్షీణించిన ధరలు
సోయా, సన్‌ఫ్లవర్, పామాయిల్ రేట్లలో మార్పు
డిసెంబర్ రెండోవారంలో
భారత్‌లో 9 శాతం తగ్గే అవకాశం
సన్‌ఫ్లవర్ ధరల విషయంలో మాత్రం ఇది తాత్కాలికమే!
కోల్‌కతా, నవంబర్ 29: నాలుగు నెలలుగా పైపైకి ఎగబాకిన వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అంతర్జాతీయంగా గత 15 రోజులుగా సోయాబీన్, సన్‌ఫ్లవర్, పామాయిల్ ధరలు టన్నుపై 100 డాలర్ల మేర క్షీణించాయి. ఫలితంగా డిసెంబర్ రెండోవారం నాటికి భారత్‌లో వంటనూనెలు ధరలు 9 శాతం వరకు తగ్గే అవకాశముంది. అంతర్జాతీయంగా సోయాబీన్ ఉత్పత్తి పెరగడం వల్ల సోయా నూనె ధరలపై ప్రభావం పడింది.
సన్‌ఫ్లవర్ విషయంలోనూ ఇదే జరిగింది. కాగా పామాయిల్‌కు సంబంధించి అతిపెద్ద ఉత్పత్తిదారు అయిన ఇండోనేసియాలో బయోడీజిల్ పాలసీపై సందిగ్ధం నెలకొనడంతో వాటి ధరలు కూడా తగ్గడం గమనార్హం.
అధిక ఉత్పత్తి వల్ల
హోల్‌సేల్ మార్కెట్‌లోనూ నువ్వుల నూనెపై రూ.10 తగ్గి రూ.136కు చేరుకుంది. అందువల్ల రిటైల్ ధర కూడా తగ్గనుంది. దీంతో వంటనూనెల ధరలు డిసెంబర్ నెల మధ్య నాటికి 8 నుంచి 9 శాతం తగ్గే అవకాశముందని సన్‌విన్ గ్రూప్ సీఈవో సందీప్ బజోరియా చెప్పారు. కాగా, దేశ అవసరాల దృష్ట్యా ఏటా దాదాపు 150 కోట్ల టన్నుల వంట నూనెలను భారత్ దిగుమతి చేసుకుంటుంది. సోయాబీన్ విషయానికి వస్తే ఇప్పటికే విస్తారంగా సప్లయి ఉండటంతో పాటు దక్షిణ అమెరికాలో ఈసారి పంట దిగుబడి భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఫలితంగా ధరలు మరింత తగ్గనున్నట్లు ఎన్‌కే ప్రోటీన్స్ ఎండీ ప్రియం పటేల్ తెలిపారు.మరోవైపు వచ్చే ట్రంప్ ప్రభుత్వంలో బయోడీజిల్ పాలసీలోనూ మార్పులు వచ్చే అవకాశముందని, అందువల్ల వంటనూనెల ఉత్పత్తి పెరిగుతుందని పేర్కొన్నారు. ఫలితంగా ధరలు తగ్గుతాయని వెల్లడించారు.
సన్‌ఫ్లవర్‌పై తాత్కాలికమే
సన్‌ఫ్లవర్ నూనె విషయానికి వస్తే ధరల్లో తగ్గుదల తాత్కాలికంగానే ఉంటుందని పటేల్ అంటున్నారు. రష్యా ఏ క్షణంలోనైనా సన్‌ఫ్లవర్ నూనె ఎగుమతులపై సుంకాలు పెంచవచ్చని చెప్పారు. రష్యా చేస్తున్న ప్రతిపాదనల ప్రకారం డిసెంబర్‌లో 183 శాతం అధికంగా సుంకాన్ని విధించే అవకాశముంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై ప్రభావం చూపుతుందని చెప్పారు. భారత్ విషయానికి వస్తే 10 కేజీల నూనెపై రూ.50 అదనపు భారం పడనుంది.
ఇండోనేసియా పునరాలోచనతో..
ఇండోనేసియా బయోడీజిల్ ఉత్పత్తి కోసం పామాయిల్‌పై ఆధారపడుతుం ది. ప్రస్తుతం బయోడీజిల్‌లో 65 శాతం డీజిల్, 35 శాతం పామాయిల్‌ను వాడుతోంది. అయితే దీన్ని 40 శాతానికి పెం చాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో సా గు విస్తీర్ణం పెరుగుతుందని, దానిద్వారా అడవుల విస్తీర్ణం తగ్గుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రతిపాదనపై ఇండోనేసియా పునరాలోచిస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తి అలాగే ఉండటంతో పామాయిల్ టన్ను ధర 100 డాలర్లు పడిపోయి 1,130 డాలర్ల వద్ద కొనసాగుతోంది.