calender_icon.png 6 March, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి రోజే నిలిచిన కన్వేయర్ బెల్ట్

06-03-2025 12:42:40 AM

  • కూలడానికి సిద్ధంగా  మరికొన్ని సెగ్మెంట్లు                     
  • ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలకు మళ్లీ ఆటంకం!
  • రోబో యంత్రాలపైనే ఆశలు? 

నాగర్‌కర్నూల్, మార్చి 5  (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 12 రోజులు పూర్తికావస్తున్నా నేటికీ కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. 8 మంది కార్మికులను రక్షించేందుకు 11 రకాల దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన రెస్క్యూ టీంలు నాలుగు షిఫ్టులుగా ప్రతి నిమిషం టన్నెల్‌లో నిర్విరామంగా పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం రోబో యంత్రాలపైనే ఆశలు పెట్టుకుంటున్నారు.

సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సుమారు నిమిషానికి 6000 లీటర్ల నీటి ఊట నిర్విరామంగా వస్తుండగా నీటి ఊటతోపాటు బురద నిత్యం సొరంగంలోకి వచ్చి పడుతోంది. రెస్క్యూటీమ్‌లకు తీవ్ర అడ్డంకిగా మారిన నీటి ఊటతోపాటు బురద బయటికి తరలించేందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న కన్వర్ బెల్ట్ మంగళవారం కేవలం కొద్ది గంటలు మాత్రమే పనిచేసి మళ్లీ నిలిపివేశారు.

డేంజర్ జోన్ వరకు కన్వేర్ బెల్ట్ మరమ్మత్తు పనులు పూర్తి అయినప్పటికీ జాయింట్ చేసిన బెల్ట్ పూర్తిస్థాయిలో సెట్ అయ్యేంతవరకు సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు టీబీఎం శకలాలను గ్యాస్ కట్టర్ల ద్వారా వేరు చేసిన విడిభాగాలను కన్వేయర్ బెల్ట్ పైనుంచి బయటికి వెలికి తీసే వెసులుబాటు లేదంటున్నారు. దీంతో టన్నులకొద్దీ బరువు ఉన్న శకలాలను కిలోమీటర్ల కొద్దీ మోసుకు వచ్చి లోక్ ట్రైన్ ద్వారా బయటికి పంపాల్సి ఉంది.

కానీ నడుచుకుంటూ టన్నులకొద్దీ బరువు ఉన్న శకలలను మోసుకు రావడం రెస్క్యూటివ్ బృందాలకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. దీంతోపాటు ఎన్జీఆర్‌ఐ నిపుణులు జీపార్ రాడార్ ద్వారా మార్కింగ్ వేసిన ప్రదేశాల్లో మట్టి తవ్వకాలకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి.

కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. దీంతో సహాయక చర్యలు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సొరంగంలో పేరుకుపోయి ఉన్న పదివేల క్యూబిక్ మీటర్ల మట్టిని పూర్తిస్థాయిలో తొలగిస్తే గాని కార్మికుల జాడ కనిపెట్టే అవకాశం లేదని ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రోబో యంత్రాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.