calender_icon.png 25 October, 2024 | 5:56 AM

పనులు వేగవంతం చేయండి

23-07-2024 01:21:36 AM

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చండి

ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో భేటీలో మంత్రి కోమటి రెడ్డి 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు నల్గొండ బైపాస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌కు విజ్ఞప్తి చేశారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్‌ఎఫ్‌సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన అనురాగ్ జైన్‌తో భేటీ అయి.. పలు అంశాలపై చర్చించారు. రాష్ర్ట భవిష్యత్తును మార్చే ఆర్‌ఆర్‌ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) పనులను వేగవంతం చేయడంతోపాటు, నల్గొండ బైపాస్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరారు.

రాష్ర్టంలోని 16 రాష్ర్ట రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించగా.. కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్‌ఎఫ్ సీ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ర్టంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రోడ్లపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించేందుకు కావల్సిన అనుమతులను మంజూరు చేయాలన్నారు. నల్గొండ పట్టణంలో ఎన్‌హెచ్‌565పై ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేనందున వివిధ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారని అనురాగ్ జైన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై విద్యార్ధులు ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం విజ్ఞప్తులు చేశారని పీఎంఓ సైతం పరిస్థితిని చక్కదిద్దాలని కోరిందన్నారు. అనురాగ్ జైన్ వారం రోజుల్లో ఎస్‌ఎఫ్‌సీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.