19-03-2025 12:00:00 AM
మహారాష్ట్ర శంభాజీనగర్ జిల్లాలోని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఇప్పుడు రాష్ట్రంలో మత, రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ సమాధిని కూల్చేస్తామంటూ విశ్వ హిందూ పరిషత్ చేసిన ప్రకటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి మతం రంగు పులుము కొంది. అయితే దీనికంతా ఇటీవల వచ్చిన ఓ సినిమా కారణం కావడం గమనార్హం.
ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధా రంగా వచ్చిన ‘ఛావా’ సినిమాతో ఔరంగ జేబు సమాధి అంశం తెరపైకి వచ్చిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం. చరిత్రకెక్కని మరాఠాయోధుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించడంతో పాటుగా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొంది.
కానీ ఆ సినిమాలో శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టి చంపించే దృశ్యాలను క్లకు కట్టినట్లు చూపించారు. అదే ఇప్పుడు వివాదానికి కారణమయింది. శివాజీ అంటే మరాఠా ప్రజలకు అంతులేని భక్తి అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి శివాజీ కుమారుడిని దారుణంగా చంపించిన ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ ఆందోళనలు మొదలయయ్యాయి.
ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే అబూ ఆసిమ్ అజ్మీని అసెంబ్లీనుంచి సస్పెండ్ చేసే దాకా పరిస్థితి వెళ్లింది. కాగా సోమవారం మధ్యాహ్నం బజరంగ్‌దళ్ కార్యకర్తలు నాగపూర్ మహల్ ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతలకు కారణమయింది. ఆ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మతగ్రంథాన్ని తగులబెట్టారన్న వదంతులు వ్యాపించాయి.
దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొందరు దుండగులు వాహనాలకు నిప్పుపెట్టడమే కాకుండా నివాసాలు, షాపులను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో దాదాపు 20 మంది గాయపడగా, వారిలో 15 మంది పోలీసులు ఉన్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతా ల్లో కర్ఫ్యూ విధించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్‌లో ఈ సంఘటనలు చోటు చేసుకోవడం అటు రాజకీయంగానే కాకుండా ఇటు మతపరంగా కూడా ఆందోళనకు కారణమైంది. పురావస్తు శాఖ అధీనంలో ఉన్న ఔరంగజేబు స్మారకం వద్ద భద్ర తను కట్టుదిట్టం చేశారు. ఔరంగజేబు సమాధిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, అయితే ఆయనను కీర్తించడాన్ని మాత్రం సహించేది లేదని సీఎం ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రకటించారు.
ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగినట్లు ఉంద ని కూడా ఆయన ఆరోపించారు. ఛావా సినిమా ఈ మొత్తం ఘటనలకు కారణంగా సీఎం ప్రకటించడం గమనార్హం. ఆ సినిమాలో శంభాజీ పాత్రను హై లెట్ చేయడం కోసం ఔరంగజేబును ఓ హంతకుడిగా చిత్రీకరించారని, వాస్తవానికి ఔరంగజేబు ఎన్నో ఆలయాలను నిర్మించారనేది కొందరి వాదన.
ఆరో మొగల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు 1707 మార్చిలో మరణించారు. ఆయన కోరిక మేరకు ఔరంగాబాద్‌లో ఉన్న ఖుల్నాబాద్‌లోని షేక్ జైనుద్దీన్ దర్గా ప్రాంగణంలో ఆయనను సమాధి చేశారు. ఈ సమాధికి అయిన ఖర్చును ఔరంగజేబు స్వయంగా టోపీలు కుట్టి మరీ సంపాదించినట్లు చెప్తారు. అలాగే తన సమాధి ఎలా ఉండాలో ముందే ఆదేశాలు కూడా ఇచ్చారు.
దీంతో మిగతా మొగల్ చక్రవర్తుల సమాధులకు భిన్నంగా సీదాసాదాగా ఈ సమాధిని నిర్మించారు. ఇన్నేళ్లు లేని వివాదం ఇప్పుడు ఒక్క సినిమా కారణంగా తలెత్తి రాష్ట్రమంతా అట్టుడికి పోవడం దురదృష్టకరం. సినిమాను సినిమాగా చూడాలే తప్ప అందులోని ఘటనలపై ఎక్కువ స్పందిస్తే ఏమవుతుందో ఛావా సినిమానే ఉదాహరణ.
వివాదం మరింత ముదిరి మరో మత ఉద్రిక్తతకు కారణమవుతుందా, లేక ప్రభుత్వం ఉక్కుపాదంతో అల్లరి మూకలను అణచివేసి శాంతిభద్రతలను పరిరక్షిస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమయినా చరిత్రలో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలపై ఇప్పుడు స్పందించడం, వారిని హంతకులుగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమే అవుతుందనేది చరిత్రకారుల మాట.