ఈసారి కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే విజయమని, నాలుగు వందలకు పైగా స్థానాల్లో గెలుపొంది ముచ్చటగా మూడోసారి ఢిల్లీ గద్దె నెక్కుతామని ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందునుంచే ఢంకా బజాయించి చెబుతున్నారు. అసలైన ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతిపక్షాల కూటమిపైనా, ముఖ్యంగా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపైనా విమర్శల జోరు పెంచుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం బన్సారాలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను వలస వచ్చిన వారికి, ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకు పంచి పెడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్స్ మనస్తత్వం వున్న ఆ పార్టీ నేతలు మన తల్లులు, అక్కచెల్లెళ్ల మెడలోని మంగళసూత్రాలను కూడా వదిలి పెట్టరని మండిపడ్డారు.
తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కకట్టి దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని, ఆ తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు. ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందంటూ 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ చేసిన వివాదాస్పద ‘ఫస్ట్ క్లెయిమ్’ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, ఆ పార్టీ మేనిఫెస్టో ఆందోళనకరంగా, తీవ్రభావజాలంతో ఉందని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తోపాటుగా ప్రతిపక్షాల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
మోడీ చెప్పిన మాటలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేవని ఆ పార్టీ స్పష్టం చేసింది. మొదటి దశ పోలింగ్‌లో ఎదురుగాలి వీచిందన్న సంకేతాలతో మోడీ అబద్ధాలు చెప్పడం మరింత పెంచారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్‌లో మండి పడ్డారు. ప్రజల సంపదను పంచిపెట్టే ఉద్దేశ్యం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను ఇండియా కూటమి భాగస్వామి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. మోడీ అబద్ధాల గురించి దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి తెలుసునని, కాంగ్రెస్ న్యాయపాత్ర, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ఆయన అబద్ధాలు ప్రచారం చేసిన తీరు నీచ రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.
పదేళ్లలో దేశానికి ఏం చేశారో దాని గురించి చెప్పాలని, అసలు సమస్యలపై మాట్లాడాలని ప్రధాని మోడీని చేతులు జోడించి ప్రార్థిస్తున్నానంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒకింత భావోద్వేగంగా అన్నారు. మోడీ దేశ ప్రజలు, యువత ఎదుర్కొంటున్న అసలైన సమస్యల గురించి మాట్లాడకుండా మందిరాలు, ముస్లింల గురించే మాట్లాడుతారంటూ దుయ్యబట్టారు. 2002 నుంచి ఇప్పటి వరకు మోడీ ఏకైక హామీ ముస్లింలను మభ్యపెట్టి ఓట్లను దండుకోవడమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు. సామాన్యులకు ముస్లింల పట్ల వ్యతిరేకతను పెంచుతున్నారని కూడా అన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ మాజీ నాయకుడు, రాజ్యసభ స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఇది దేశానికి, ఈసీకి అవమానకరమన్నారు.
ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీయడం మాట అటుంచితే 400కు పైగా స్థానాలను సునాయాసంగా గెలుస్తామని చెబుతున్న కమలం పార్టీ అగ్రనేతలు ఇంతగా దిగజారి ప్రతిపక్ష పార్టీపై ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారనేదే ప్రశ్న. అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేయడం సహజమే. కానీ, అధికారంలో ఉన్న పార్టీ సంయమనం పాటించడం అవసరం. వాళ్ల్లుకూడా దిగజారి మాట్లాడితే తేడా ఉండదు. ప్రధాని రాజస్థాన్‌లో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఎన్నికల సంఘం ప్రతినిధి నిరాకరించడం గమనార్హం.