calender_icon.png 7 November, 2024 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎంలపై వివాదం

19-04-2024 12:10:00 AM

ఎన్నికల్లో ఓటు వేయడానికి పేపర్ బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా వాటి విశ్వసనీయతపై వివాదం కొనసాగుతూనే ఉంది. పేపర్ బ్యాలెట్ కారణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం కావడం, రిగ్గింగ్‌కు అవకాశం ఉండడం లాంటి పలు కారణాలవల్ల ఎన్నికల కమిషన్ ఈవీఎంలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 1982లో తొలిసారి కేరళలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ ప్రయోగాత్మకంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టింది. పేపర్ బ్యాలెట్ స్థానంలో ఈవీఎంలను ఉపయోగించడంపై దాఖలైన పిటిషన్ల సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికల ప్రక్రియలో ఏదైనా మార్పు చేయాలంటే సంబంధిత చట్టంలో పార్లమెంటు సవరణ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. దరిమిలా  ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ తీసుకు రావడంతో ఈవీఎంల వినియోగానికి మార్గం సుగమమైంది.

దరిమిలా మొదట రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో, తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దశలవారీగా వీటిని ఈసీ ప్రవేశపెట్టింది. చివరికి 2004 లోక్‌సభ ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలనే ఉపయోగించడం జరుగుతూ ఉంది. అయితే, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు ఆదినుంచీ ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ ఆరోపణలను అటు ఎన్నికల సంఘం, ఇటు అధికార బీజేపీ తోసిపుచ్చుతూ వస్తున్నాయి.

ఐనా, వివాదం సద్దుమణగలేదు. దీనికి పరిష్కారంగా ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్‌లతో క్రాస్ చెక్  చేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇప్పటిదాకా ఇది మాక్ పోలింగ్ సమయంలో, ఎంపిక చేసిన ఈవీఎంలలో మాత్రమే పరీక్షించడం జరుగుతోంది.  కానీ, ప్రతి ఓటరుకూ వీవీప్యాట్ స్లిప్‌లు అందించాలని, అలాగే అన్ని ఈవీఎంలలో పోల్ అయిన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్‌లతో క్రాస్ చెక్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. గురువారం విచారణ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఎన్నికల ప్రక్రియ ఎంతో పవిత్రమైందని, ఓటర్లు ఆశించింది జరగలేదని ఎవరూ భయాందోళనలు చెందకుండా చూసుకోవాలని ధర్మాసనం ఈసీకి సూచించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేరళలోని కాసరగోడ్‌లో ఇటీవల మాక్ పోలింగ్ నిర్వహించారని, దీనిలో నాలుగు ఈవీఎంలను వీవీప్యాట్‌లతో సరిపోల్చినప్పుడు బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని పిటిషనర్లలో ఒకరైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది  ప్రశాంత్ భూషణ్ తెలిపారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా బెంచ్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనిపై  కాసరగోడ్ జిల్లా కలెక్టర్ నుంచి వివరణను కూడా తెప్పించుకున్నామని, ఆ నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ తెలిపారు.

కాగా, ఓటరు ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్ స్లిప్ తీసుకునేందుకు అవకాశం కల్పించాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది నిజాం పాషా కోరారు. ‘ఈ ప్రక్రియ ఓటరు గోప్యతకు భంగం కలిగించదా?’ అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించగా, ‘లేదని’ న్యాయవాది చెప్పారు. వీవీ ప్యాట్‌లోని మిషిన్‌లో లైటు ఎల్లవేళలా వెలుగుతూ ఉండాలని ప్రశాంత్ భూషణ్ సూచించారు. దీనివల్ల ఓటరు స్లిప్ కటింగ్, బాక్స్‌లో పడడాన్ని చూడగలుగుతాడని, ఇది వారి గోప్యతకు అడ్డు రాదని చెప్పారు. పారదర్శక ఓటింగ్‌కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కూడా ధర్మాసనం ఈసీని ప్రశ్నించింది. చివరగా సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై ఈ మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంటుంది.