calender_icon.png 20 September, 2024 | 10:11 AM

‘కన్వర్’ వివాదం

21-07-2024 12:00:00 AM

మన దేశంలో ప్రతి అంశం వివాదాస్పదమే. జాతీయ వివాదాలు కొన్నయితే ప్రాంతీయ వివాదాలు మరి కొన్ని. పాలకులు ముందు చూపు లేకనో, లేదా రాజకీయ ప్రయోజనాలు ఆశించో తీసుకునే నిర్ణయాలు ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఏటా జరిగే కన్వర్ యాత్రకు ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఉత్తర్వు  ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాదిన ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కన్వరీ యాత్ర ఓ పెద్ద  ఉత్సవం. ప్రతి ఏటా శ్రావణ మాసం ప్రారంభంలో మొదలయ్యే ఈ యాత్ర సందర్భంగా గంగానదీ తీర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.

పవిత్ర శ్రావణ మాసంలో  భోలేనాథ్(శివుడు)ను పూజిస్తే త్వరగా సంతోషించి అనుగ్రహిస్తాడని హిందువుల నమ్మకం. హరిద్వార్‌నుంచి గంగాజలాలను కావిడితో తీసుకొచ్చి తమ గ్రామాల్లోని శివాలయాల్లో శివలింగానికి జలాభిషేకం చేస్తారు. ఈ యాత్రను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా చేపడతారు. హిందూ పంచాగాల ప్రకారం ఉత్తరాది వారు పూర్ణిమనుంచి పూర్తిమ దాకా ఒక నెలగా పాటిస్తారు. ఈ ఏడాది జులై 22న శ్రావణ మాసం తొలి రోజుతో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 2తో ముగుస్తుంది. వేలాది భక్తులుపాదయాత్రగా బయలుదేరి హరిద్వార్‌కు చేరుకుని అక్కడినుంచి గంగా జలాలనుకావడితో తీసుకెళ్లి తమ గ్రామాల్లోని శివాలయాల్లో పూజలు నిర్వహిస్తారు.

అయితే కన్వర్‌యాత్ర చేపట్టే మార్గంలో ఉండే హోటళ్లు, తినుబండారాల షాపులకు ఉండే నేమ్‌ప్లేట్లపై యజమానుల పేర్లు, మొబైల్ ఫోన్ నంబర్లు, అడ్రసులు ఉండాలంటూ యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు, ఆ మార్గంలో మాంసం అమ్మకాలు ఉండకూడదని కూడా ఆదేశించింది. యాత్ర చేపట్టే వారి మధ్య గందరగోళం ఉండరాదని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చెబుతోంది. అయితే ముస్లింల హోటళ్లనుంచి యాత్రికులు ఏమీ కొనుగోలు చేయకుండా చేయాలనే కుట్రతోనే యూపీ సర్కార్ ఈ నిబంధన పెట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బీజేపీ ముస్లింలు, దళితుల హక్కులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని, అయితే బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందంటూ దుయ్యబట్టారు. కన్వర్ యాత్రపై జరుగుతున్న రాజకీయాలు దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్లడం లేదు. సామాన్యులకు ఈ సమస్యలతో సంబంధం లేదని, ఇలాంటి అంశాలను ప్రధాని, హోంమంత్రి, ముఖ్యమంత్రులు లేవనెత్తకూడదని, ప్రముఖ న్యాయవాది , రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా మండిపడ్డ్టారు. ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదో యాత్రికులకు బాగా తెలుసునని కూడా అన్నారు. బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్, నటుడు సోనూసూద్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లాంటి వాళ్లు కూడా స్పందించడంతో ఇది బీజేపీ, ఇతర వర్గాల మధ్య మాటల యుద్ధంగా మారింది.

అయితే మత విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతోనే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయి. శబరిమలకు వెళ్లే లక్షలాది అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో యాత్ర చేస్తుంటారు. నియమనిష్ఠలు కూడా పాటిస్తారు. అయితే కేరళ ప్రభుత్వం కానీ, ఇతర ప్రభుత్వాలు కానీ ఇప్పటివరకు ఈ యాత్రకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. భక్తుల సౌకర్యాలపైనే దృష్టిపెడుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో  వివిధ మతాలకు చెందిన ఉత్సవాలు జరుగుతుంటాయి. అన్ని మతాల వారు వాటిలో పాల్గొంటారు. నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గాలో ఏటా జరిగే రొట్టెల పండుగకు దేశం నలు మూలలనుంచి భక్తులు వస్తుంటారు. వీరిలో హిందువులే ఎక్కువ ఉంటారు. కానీ ఎప్పుడూ ఇలాంటి వివాదం తలెత్తలేదు. కేంద్రం జోక్యం చేసుకుని ఈ కన్వర్ యాత్ర వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికితే మేలు.