కర్నాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటర్లకు తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం పెద్ద గుదిబండగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే వీటి అమలుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సిద్ధరామయ్య సర్కార్ మొదటి హామీగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఏడాది క్రితం ఈ పథకాన్ని ప్రారంభించినప్పటినుంచీ వివాదాస్పదంగానే మారింది. ఈ ‘శకి’్త స్కీమ్ వల్ల ప్రభుత్వంపై ఏటా 7,600 కోట్ల వరకూ భారం పడుతోంది.
పథకాన్ని ప్రవేశపెట్టిన కొత్తల్లో మహిళలు పెద్ద సంఖ్యలో బస్సు ప్రయాణానికి ఎగబడ్డంతో తోపులాటలు, అప్పుడప్పుడూ చిన్నపాటి ఘర్షణలూ జరిగాయికూడా . అయినా పార్టీ ఓటు బ్యాంకు అయిన మహిళలనుంచి పథకానికి లభిస్తున్న ఆదరణను చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికష్టాలు ఎదురయినా దీన్ని కొనసాగిస్తూ వస్తోంది. మిగతా నాలుగు హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదంటూ ప్రతిపక్ష బీజేపీ నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కర్నాటకలో ఇచ్చిన హామీలు తమను అధికారంలోకి తీసుకొచ్చిన స్ఫూర్తితో తెలంగాణలోనూ కాంగ్రెస్ ఇదే తరహా హామీలను ప్రకటించడం, ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి రావడం తెలిసిందే.
హామీల అమలులో భాగంగా రాష్ట్రంలోనూ మొట్టమొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేశారు.అంతవరకు బాగానే ఉంది. కానీ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉచిత బస్సుపథకంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్కార్‌ను చిక్కుల్లో పడేశాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో మహిళలు కొంతమంది మహిళలు తాము టికెట్ డబ్బులు చెల్లిస్తామంటూ తనకు ట్వీట్లు, ఈ మెయిల్స్ చేస్తున్నారని,దీనిపై ఆలోచిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దమారాన్నే రేపాయి.
రాష్ట్రంలో ఈ పథకాన్ని రద్దు చేస్తారంటూ వార్తలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం సిద్ధరామయ్య రంగంలోకి దిగి శక్తి పథకాన్ని రద్దు చేసే ఆలోచనే లేదంటూ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ఈ గందరగోళం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. హామీల ప్రకటన విషయంలో జాగ్త్రత్తగా ఉండాలని, బడ్జెట్‌తో సరిపోయే హామీలను మాత్రమే ఇవ్వాలంటూ త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లకు సూచించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలను ప్రకటించదని కూడా తేల్చి చెప్పారు.
ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు ఓటర్లకు రకరకాల హామీలు ప్రకటించడం దేశంలో ఆనవాయితీగా మారింది. తమిళనాడులో జయలలిత హయాంలో ఈ ఉచిత తాయిలాల వ్యవహారం మొదలైంది. ఓటర్లకు గాలం వేయడానికి అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఎడా పెడా తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికీ అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయడానికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు ఇదే బాటలో నడుస్తున్నాయి.
ఏడాదిన్నర క్రితం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, మహిళలకు రూ.2 వేల ఆర్థిక భృతి వంటి పథకాలను అమలు చేస్తామంటూ అయిదు ఉచిత హామీలను ప్రకటించింది.ఈ పథకాలకు అందమైన పేర్లనూ పెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ఈ హామీలు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు ఈ హామీలే అక్కడి ప్రభుత్వం మెడకు చుట్టుకొంటున్నాయి.
అలవిమాలిన హామీలను ఇవ్వడం చాలా సులభమని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టమనే విషయాన్ని కాంగ్రెస్ ఇప్పుడు గ్రహించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ సైతం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మరోసారి ఈ ఉచిత హామీలపై దేశవ్యాప్త చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.