calender_icon.png 25 November, 2024 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పంపకాలకు కన్నవారి గొడవ

18-05-2024 12:19:30 AM

రెండు రోజులపాటు శవ జాగరణ

ఎట్టకేలకు తెగిన పంచాయతీ

అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు

సూర్యాపేట జిల్లా 

కందులవారిగూడెంలో ఘటన

సూర్యాపేట, మే17 (విజయక్రాంతి) : ఆస్తి కోసం కన్నవారు ఎంతటి దారుణానికైనా ఒడిగడతారనడానికి ఇదో మచ్చు తునక. కన్నతల్లి చనిపోయిన విషయాన్ని పక్కన పెట్టి కొడుకులు, బిడ్డలు ఆస్తి పంపకాలకు దిగారు. ఏకంగా రెండు రోజులు తల్లి మృతదేహంతో శవ జాగరణ చేశారు. చివరకు ఆస్తుల పంచాయితీ తెగడంతో శుక్రవారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. సంచలనం కలిగించిన ఈ వార్త సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కందులవారిగూడెంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన వేం లక్ష్మమ్మ, వెంకట్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భర్తతోపాటు చిన్న కుమారుడు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. ఏడేళ్లుగా లక్ష్మమ్మ చిన్నకూతురు వద్ద ఉంటోంది. కొద్ది రోజుల క్రితం లక్ష్మమ్మ కాలుజారి కిందపడింది. బలమైన గాయాలతో చికిత్సపొందుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆక్సిజన్ సాయంతో లక్ష్మమ్మను ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో బుధవారం రాత్రి 9గంటల సమయంలో లక్ష్మమ్మను చిన్న కుమార్తె తన ఇంటికి తీసుకెళ్లింది. తర్వాత కుమారుడు అక్కడకు వెళ్లాడు. తన ఊరికి తీసుకెళ్తానని గొడవకు దిగాడు.

ఏకంగా పెద్దమనుషుల్లో పేచీ పెట్టాడు. అయితే, ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేదని లేదని కుమార్తెలు పట్టుబట్టినట్లు సమాచారం. వీరు గొడవ పడుతుండగానే లక్ష్మమ్మ ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత పెద్దమనుషులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో లక్ష్మమ్మ మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించారు.  చివరకు పెద్దమనుషుల సమక్షంలో ఆస్తి పంపకాలు ముగిసినా.. కొడుకు తన దగ్గర డబ్బులు లేవని అంత్యక్రియలు నిర్వహించేందుకు మొండికేశాడు.

చివరకు లక్ష్మమ్మ బతికున్న సమయంలో ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బులో నుంచి రూ.1.5లక్షలను చిన్నకూతురు బయటపెట్టడంతో వివాదం సమసిపోగా, అప్పుడు గానీ ఆ మాతృమూర్తి ఆఖరి మజిలీకి అడుగులు పడలేదు. ఎట్టకేలకు ఆస్తి పంపకాలు ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకోగా, వీరి తీరుపై గ్రామస్తులు దుమ్మెత్తిపోశారు. శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎవరైనా ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.