- ప్రజలకు తీవ్ర సమస్యగా కుక్కలు
- కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): కుక్కలు మనుషులను వెంటాడుతున్నాయని శుక్రవారం హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్లపైన వెళ్లేవారినే కాకుండా ఇళ్లలోకి వెళుతున్నాయని, ఇంట్లో ఉన్న 82 ఏళ్ల వద్ధ మహిళ కుక్కల దాడిలో మృతి చెందినట్లు పత్రికల్లో వచ్చిన కథనం అందరినీ కలచివేసిందని వ్యాఖ్యానించింది. 14 మంది బాలలపై కుక్కలు దాడులు చేశాయని గుర్తుచేసింది. వీటి నియంత్రణకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని.. నిపుణులు, జం తు సంక్షేమ సంఘాల వారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. ఈ విషయంలో వాద, ప్రతివాదాలు అవసరంలేదని.. పరిష్కారమే అంతి మమని స్పష్టంచేసింది.
కుక్కల నియంత్రణపై దాఖలైన రెండు పిల్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) నిబంధనల అమలు, పర్యవేక్షణకు కమిటీని ఏర్పా టు చేస్తూ జూలై 16న ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు, ప్రజారోగ్యశాఖ ప్రతినిధులు, ఏబీసీ కేంద్రాల సబ్ కమిటీలు, మాస్టర్ ట్రైనర్లు, ఐఈసీ సబ్‌కమిటీ సభ్యులతో జూలై 22న సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు చెప్పారు.
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏబీసీ నిబంధ నల అమలుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. హైద రాబాద్ మున్సిపాలిటీ ఆవల జంతు పునరావాస కేంద్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని జీహెచ్‌ఎంసీకి సూచించింది. కుక్క కాటు, వీధి కుక్కల గురించి ప్రజలు సంప్రదించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కుక్కలను పట్టుకోవడానికి 24 గంటలూ అందుబాటులో ఉండేలా వాహనాల ఏర్పా టు చేయాలని సూచించింది. కుక్కలకు ఆహా రం అం దించేందుకు ముందుకు వచ్చేవాళ్లకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కుక్కల దాడులను నివారణకు తీసుకుంటున్న చర్యలను నివేదిస్తూ శుక్రవారం జీహెచ్‌ఎంసీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
గోరటి వెంకన్నపై కేసులో హైకోర్టు స్టే
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వద్ద డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ ఇంటర్వ్యూ నిర్వహించడంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు గత ఏడాది కేటీఆర్‌తోపాటు ఆయనను ఇంటర్వ్యూ చేసిన గోరటి వెంకన్నపై కేసు నమోదు చేశారు.
దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రజాప్రతినిధుల కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గోరటి వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని ఆరోపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి కింది కోర్టులో కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.
క్రిశాంక్‌పై కేసులో రూల్స్ పాటించండి : హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరువుకు నష్టం కలిగించేలా సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్‌పై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై నమోదైన కేసు దర్యాప్తులో చట్ట ప్రకారం నిబంధనలను అమలు చేయాలని పోలీసులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఎన్‌ఎస్‌ఎస్ 35 (సీఆర్పీసీ 41ఏ) కింద నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
గత నెల 30న డీ శశిధర్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మన్నె క్రిశాంక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ కే సుజన విచారణ చేపట్టి పోలీసులకు, ఫిర్యాదుదారు డీ శశిధర్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. చట్ట ప్రకారం నిందితుడికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.