calender_icon.png 1 November, 2024 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకింగ్ రిస్క్ తగ్గించడానికే అన్‌సెక్యూర్డ్ రుణాలపై నియంత్రణ

21-06-2024 12:10:00 AM

రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్

ముంబై, జూన్ 20: సంక్షోభ వాసనలను ముందుగానే పసిగట్టి, తగిన చర్యల్ని తీసుకోవడం రిజర్వ్‌బ్యాంక్ బాధ్యత అని గవర్నర్ శక్తికాంత్‌దాస్ చెప్పారు. అన్‌సెక్యూర్డ్ రుణ వితరణపై ఏ చర్యలూ తీసుకోకుండా, అవి ‘పెద్ద సమస్యల్ని’ తెచ్చిపెడతాయన్నారు.  ఆర్బీఐ కాలేజ్ ఆఫ్ సూపర్‌వైజర్స్‌లో గురువారం జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ రిస్క్‌తో కూడిన తనఖా లేని రుణాలపై తాము 2023 నవంబర్‌లో విధించిన నియంత్రణల కారణంగా బ్యాంక్‌ల లోన్ పోర్ట్‌ఫోలియోల్లో వాటి శాతం తగ్గిందని దాస్ చెప్పారు. అన్‌సెక్యూర్డ్ రుణ వృద్ధి కారణంగా క్రెడిట్ మార్కెట్లో సమస్య ఏర్పడకుండా నియంత్రణలు విధించామన్నారు. ఈ రుణ వితరణలో అండర్‌రైటింగ్ ప్రమాణాలు తగ్గడం, తగిన అప్రయిజల్స్ లోపించడం, ఈ రుణాల్ని పెంచుకోవడానికి బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల్లో పోటీ ఏర్పడటం వంటివి తాము గమనించామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. తమ నియంత్రణలు తగిన ప్రభావాన్ని చూపడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 

ద్రవ్య విధానం యథాతథం

తమ ద్రవ్య పరపతి విధానాన్ని మార్చడం తొందరపాటు కాగలదని, వడ్డీ రేట్ల విషయంలో ‘సాహసం’ చేయబోమని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు.  మూల ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతున్నదని చెప్పారు. ఈ తరుణంలో పాలసీలో మార్పుచేయడం తొందరపాటు అవుతుందని, ఏ రూపంలోనూ సాహసం కూడదని, ఆర్బీఐ ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నదని తెలిపారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఇటీవల సమీక్షలో ప్రస్తుత రెపో రేటును 6.5 శాతం వద్దే అట్టిపెట్టిన సంగతి తెలిసిందే. 

తగ్గిన రుణ వితరణ

అన్‌సెక్యూర్డ్ రుణ పోర్ట్‌ఫోలియోల్లో ఆర్బీఐ చర్యలకు ముందు 30 శాతం వృద్ధి ఉండగా, అది ప్రస్తుతం 23 శాతానికి తగ్గిందన్నారు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చే రుణ శాతం 29 నుంచి 18 శాతానికి దిగిందన్నారు. అన్‌సెక్యూర్డ్ రుణా లు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే రుణాలకు గత ఏడాది నవంబర్‌లో ఆర్బీఐ రిస్క్ వెయిట్స్ పెంచింది. ఈ కారణంగా అటువంటి రుణాలపై బ్యాంక్ లు వాటి మూలధనంలో పెద్ద మొత్తాల్ని కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. లాభాలను ఆశిస్తూ ఇటువంటి ‘బుద్ధిహీనమైన’ వృద్ధి వెంపర్లాడరాదని, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బ్యాంక్‌లకు సూచించారు. వ్యాపార వృద్ధి ముఖ్యమేనని, అది ఆమోదయోగ్యంకాని రిస్క్‌లతో రాదని దాస్ చెప్పారు. యెస్ బ్యాంక్ బెయిల్‌అవుట్‌ను ఆర్బీఐ గవర్నర్ ఉదహరిస్తూ 2018 నుంచి ఆ బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలను ఆర్బీఐ గమనిస్తూ వచ్చిందని, కొవిడ్ పాండమిక్‌కు కొద్ది రోజుల ముందు 2020 మార్చిలో బెయిల్‌అవుట్ ప్రణాళికను అమలుపర్చామన్నారు.