- సిటీలో సైబర్ క్రైమ్ ఏజెంట్స్
- కమీషన్ ఆశతో బ్యాంక్ ఖాతాలు, సిమ్‌కార్డులు, సీనియర్ సిటిజన్స్ వివరాల అమ్మకాలు
- తాజాగా నగరానికి చెందిన పలువురు నిందితులను అరెస్ట్ చేసిన టీజీసీఎస్‌బీ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న నేరా ల్లో అతి ముఖ్యమైనది సైబర్ క్రైమ్. నేరగాళ్లు పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనుగుణంగా మలుచుకొని పోలీసులకు చిక్కకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాడు ఎక్కడ ఉంటాడో? ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ, తమకు అవసరమైనవన్నీ (బ్యాంక్ ఖాతాలు, సిమ్‌కార్డులు, సీనియర్ సిటిజన్స్ వివరాలు) సమకూర్చుకొని అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు.
తాజాగా కొంతమంది సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న హైదరాబాద్‌కు చెందిన పలువురిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ తీసుకొని సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఒక్కో సిమ్ కార్డుకు రూ.1000--- నుంచి రూ.2000, ఒక్కో బ్యాంక్ ఖాతాకు రూ.10 వేల నుంచి రూ. 50 వేలు, సీనియర్ సిటిజన్స్ వివరాలు ఇచ్చి రూ.50 వేల వరకు కమీషన్ పుచ్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
డబ్బు ఆశతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి..
ప్రజలకు డబ్బు ఆశ చూపి, వారితో బ్యాంక్ ఖాతాలు తెరిపించి సైబర్ నేరగాళ్లకు వాటిని సమకూరుస్తున్న ఇద్దరు హైదరాబాదీలతో సహా వారికి సహకరించిన బ్యాంక్ మేనేజర్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 600 సైబర్ నేరాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేవలం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే 6 బ్యాంక్ ఖాతాల ద్వారా నిందితులు రూ.175 కోట్ల లావాదేవీలకు పాల్పడినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. సైబర్ క్రైమ్ నేరాలను నమోదుచేసే నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఎన్‌సీఆర్‌పీ అధికారులు విచారణ చేపట్టగా..
హైదరాబాద్‌లోని షంషీర్‌గంజ్ ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ క్రైమ్ లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీనిపై దృష్టి సారించిన టీజీసీఎస్‌బీ సిబ్బంది బ్యాంక్ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించిసుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా వివిధ బ్యాంక్‌ల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ బ్యాంక్ ఖాతాలకు నగదు జమ అయినట్లు, ఆ నగదును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌కు తరలించినట్లుగా గుర్తించారు. ఒక్కో ఖాతాకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు బ్యాంక్ మేనేజర్‌కు కమిషన్ ఇచ్చినట్లు చెప్పారు. వీరి వెనక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పేర్కొన్నారు.
డీగికేవైసీ ద్వారా సిమ్‌కార్డుల యాక్టివేషన్..
సైబర్ నేరగాళ్లకు సిమ్‌కార్డులను అందిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ముందుగానే యాక్టివేట్ చేయబడిన ఎయిర్‌టెల్ సిమ్‌కార్డుల క్రయవిక్రయాలు చేస్తున్న ముఠా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాయ్ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా సిమ్‌ను యాక్టివేట్ చేయడానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి ఇవ్వాలి. అలాగే ప్రతి వ్యక్తి ఒకరోజు 2 సిమ్ కార్డులు పొందవచ్చు. ఒక సిమ్‌కార్డు జారీ ఈ కేవైసీ ద్వారా, మరొకటి ఐడీ ప్రూఫ్‌ను మాన్యువల్‌గా స్కాన్ చేయడం ద్వారా జారీ చేయవచ్చు.
దీనిని డీకేవైసీ అంటారు. ఇలా ప్రతి వ్యక్తికి కేవలం రెండు సిమ్‌కార్డులు విక్రయించాలనే నిబంధన ఉండటంతో ఓ నిందితుడు సిమ్‌కార్డులను పొందేందుకు ఒక ప్రణాళికను రూపొందించాడు. తన స్టోర్‌ను సందర్శించే కస్టమర్ పేరుపై అదనంగా ఒక సిమ్‌కార్డును పొందేలా కస్టమర్ల ఆధార్ కార్డును సేకరించి, వారికి ఒక సిమ్‌కార్డును జారీ చేసేవాడు. ఆపై కస్టమర్‌కు తెలియకుండానే వారి ఐడీ ప్రూఫ్‌ను స్కాన్ చేయడం ద్వారా మరొక సిమ్‌ను మాన్యువల్‌గా యాక్టివేట్ చేసేవాడు. అలా ఒక్కో సిమ్‌కార్డును రూ. 400 చొప్పున విక్రయించేవాడు. ఇప్పటివరకు సుమారు 2000 వరకు ప్రీ యాక్టివేటెడ్ ఎయిర్‌టెల్ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు అందజేశారు.
ప్రొవైడర్ల నుంచి బీమా పాలసీల డేటా కొనుగోలు..
బీమా వివరాలు, వాటి గడువు, ఇతరత్రా సమాచారం కేవలం ఇటు పాలసీదారులకు, అటు బీమా సంస్థలకు మాత్రమే తెలుస్తాయి. సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తిగత సమాచారాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేస్తున్నారు. డేటా ప్రొవైడర్లు, బ్రోకింగ్ కంపెనీలు రూ. 10 వేల నుంచి రూ. 20 వేలు ఇస్తే లక్షలాది మంది బీమా వివరాలను అందిస్తున్నాయి. ఇందులో పాలసీదారుల వివరాలు, వాటి గడువు, వాహనాల నంబర్లు, వాటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా పూర్తిగా వ్యక్తిగత వివరాలు ఉంటున్నాయి. ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు పాలసీదారులకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి కొత్త బీమా, రెన్యూవల్‌తో అధిక లాభాలు, బహుమతులు అందుకోవచ్చని నమ్మించి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. వీటితో వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు.
ఇతరులు చెప్పారని బ్యాంక్ ఖాతాలు తెరవొద్దు
డబ్బుకు ఆశపడి, ఇతరులు చెప్పారని బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం, సిమ్‌కార్డు యాక్టివేషన్లు వంటివి చేయవద్దు. ప్రజలు అనుమానాస్పద లావాదేవీల్లో పాల్గొనవద్దు. ఇప్పటికే మ్యూల్ ఖాతాలను తెరిచి ఉంటే దానిపై 1930 నంబర్‌లో, www. cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.
శిఖా గోయల్,
టీజీసీఎస్‌బీ డైరెక్టర్