calender_icon.png 15 February, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెదర్ పార్కుల ఏర్పాటుకు సహకరించండి

15-02-2025 01:10:23 AM

  1. జహీరాబాద్ నోడ్ అభివృద్ధికి అనుమతులిప్పించండి
  2. బయోఏషియా సదస్సుకు రండి
  3. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): తెలంగాణలోని పలు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా సహకరించాలని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖమంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ఐటీమంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ గ్రామం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద మెగా లెదర్ పార్కు లు (ఎంఎల్ పీలు) ఏర్పాటుచేయాలని కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, అవస రమైన సామూహిక కర్బన వ్యర్థాల శుద్ధి కేంద్రాలు (సీఈటీపీలు) సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం డీపీఐఐటీ నుంచి సహాయమందించాలని కోరారు.

శుక్రవారం ఢిల్లీలో పీయూష్ గోయల్‌ను శ్రీధర్‌బాబు కలిశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఇతర ప్రధాన అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, పాలసీ మేకర్లు, పారిశ్రామిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌లో ఈనెల 26న నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని గోయల్‌ను శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.

తెలంగాణలో జీవవిజ్ఞాన రంగ అభివృద్ధికి మంత్రి శ్రీధర్‌బాబు తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి ప్రశంసించారు. ఈ సంద ర్భంగా బయోఏషియా ప్రోగ్రామ్‌కు హాజరవుతానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 

జహీరాబాద్ నోడ్‌కు నిధులివ్వండి 

జాతీయ పారిశ్రామిక మార్గ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐసీడీసీ) పరిధిలోని జహీరాబాద్ నోడ్ అభివృద్ధిపై గోయల్‌తో మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత పురోగతిని వివరించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగిలిన అనుమతులు ఇప్పించాలని, అలాగే, నిధులనూ త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.

అంతేకా కుండా, ఓసాకా ఎక్స్‌పో తెలంగాణ పాల్గొంటున్నట్టు అధికారికంగా కేంద్రమంత్రికి వివరించారు. అంతర్జాతీయ వేదికగా తెలంగాణ పెట్టుబడులు, పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఎక్స్‌పోలో పాల్గొనాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖ ను కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు అందజేశారు. ఈ భేటీలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌డ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఇతర పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.