- 12 అంశాలతో ప్రధాని మోదీకి వినతిపత్రం
- రాష్ట్రం కోసమే ప్రధానితో భేటీ
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కోరాం
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు
కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగుతాయి
బీఆర్‌ఎస్‌ను టార్చ్‌లైట్ వేసి వెతుక్కోవాల్సిందే
గతంలో ఫిరాయింపులు బీజేపీకి గుర్తుకు లేవా?
బీజేపీ, కేసీఆర్ ప్రేమించుకుంటే అభ్యంతరం లేదు
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలి పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలుంటాయని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి, హోం మంత్రితో భేటీ తర్వాత గురువారం ఢిల్లీలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరామని చెప్పారు.
రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెంది మరికొన్ని రోజుల్లోనే జనం టార్చ్‌లైట్ పట్టుకుని బీఆర్‌ఎస్ పార్టీని వెతుక్కుంటూ వస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ కోసం ప్రజలు వెతుక్కుంటూ పోవడం కాదు.. అసలు ఆ పార్టీ ఎక్కడ ఉందని ప్రజలు టార్చ్‌లైట్ వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇప్పుడున్నంత దీనావస్థలో బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ లేదు. ఆ పార్టీ 23 ఏళ్ల చరిత్రలో మొదటిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు బీఆర్‌ఎస్ కండువాలు కప్పినప్పుడు బీజేపీకి ఫిరాయింపులు గుర్తుకు రాలేదా? కేసీఆర్ పట్ల బీజేపీకి సానుభూతి దేనికి? బీజేపీ, కేసీఆర్ ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేల చేరికల విషయంలో గతంతో పోలిస్తే మేము చాలా ప్రజాస్వామికంగానే ఉన్నాం’ అని తెలిపారు.
ఏఐసీసీ కోర్టులో మంత్రివర్గ విస్తరణ
పీసీసీ చీఫ్ నియామయం, మంత్రివర్గ విస్తరణ గురించి ఏఐసీసీకి విజ్ఞప్తి చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ బాల్ ఏఐసీసీ కోర్టులో ఉందని అన్నారు. ఈ నెల 7వ తేదీతో పీసీసీ చీఫ్‌గా తన పదవీకాలం పూర్తవుతుందని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన చీఫ్ నియామకం తేదీలను మీడియానే ప్రకటించి.. వాయిదా వేసిందని, తామెప్పుడూ ముహూర్తం చెప్పలేదని తేల్చేశారు.
ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరాం
భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విలీనం చేశారని, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కోరామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. వేలం లేకుండా సింగరేణికి గోదావరి పరిసర ప్రాంతాల్లోని బొగ్గు గనులు కేటాయించాలని విన్నవించినట్టు తెలిపారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించాలని, జిల్లాకొక నవోదయ పాఠశాల కేటాయించాలని కోరినట్టు వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులను పునరుద్ధరించాలని, విభజన చట్టంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతోపాటు ఐఐఎం ఇవ్వాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు సహకరించాలని, రాష్ట్ర రహదారాలను జాతీయ రహదారులుగా మార్చాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరగా.. వారు సానుకూలంగా స్పందించినట్లు భట్టి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానుండటంతో.. ఆ సమావేశంలో చర్చించేందుకు అనేక అంశాలను పొందుపర్చామని వెల్లడించారు.
ప్రధాని ముందు వినతుల లిస్టు
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయిన సీఎం రేవంత్, డిఫ్యూటీ సీఎం భట్టి వినతుల చిట్టాను వారి ముందు ఉంచారు. మోదీతో దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ సంస్థల భూముల బదలాయింపు, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు, వివిధ రంగాల వారీగా ప్రాధాన్యత, రాష్ర్ట పునర్విభజన చట్టంలోని అంశాలపై సీఎం రేవంత్ చర్చించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్, నిధులు విడుదల చేయాలని 12 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాన మంత్రికి అందజేశారు.
మోదీకి అందజేసిన వినతి పత్రంలోని అంశాలు
* సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి. ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలి. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 4౯ శాతం వాటాలున్నాయి. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలి. అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలి. రాష్ర్టంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకం.
* 2010లో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) మంజూరు చేసింది. ఐటీ రంగంలో నూతన కంపెనీలు, డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింది. 2014 తర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగలేదు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలి.
* ప్రతి రాష్ర్టంలో ఒక ఐఐఎం ఏర్పాటుచేయాలని కేంద్రం విధాన నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదు. వెంటనే హైదరాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలి. ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలో కాకుండా మరెక్కడైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామన్నా ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపునకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
* తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలి.
* రాష్ర్ట పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కోచ్ తయారీ కేంద్రానికి బదులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జూలైలో రైల్వే శాఖ ప్రకటించింది. ఇతర రాష్ట్రాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో సాధ్యం కాదని ప్రకటించింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలి.
* ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి. హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఆ కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ తొలి దశలో తెలంగాణకు తక్కువ ఇళ్లు ఇచ్చారు. నాడు రాష్ర్ట ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇళ్లు మంజూరయ్యాయి. 2024 -25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొన్నట్టు కేంద్రం ప్రకటించినందున, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూ చేయాలి.
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు తెలంగాణకు రూ.2,250 కోట్లు కేటాయించింది. ఏటా రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశారు. 2019 -20, 2021 2022 -23, 2023 -24 సంవత్సరాలకు సంబంధించి బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలి.
* హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ -కరీంనగర్ రహదారి, హైదరాబాద్- నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హె-44)పై ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించాం. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యలో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ర్ట ప్రభుత్వానికి బదిలీ చేయాలి. హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలోని 2,450 ఎకరాల భూమిని రాష్ర్ట ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రిసెర్చ్ సెంటర్ ఇమరాత్ (ఆర్‌ఐసీ) కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూమిని పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం.
* రాష్ర్ట పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుసౌ కేంద్ర సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయి. అందువల్ల వెంటనే ఉక్కు కర్మాగార నిర్మాణం ప్రారంభించాలి.
* భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దానికి భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వడంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రహదారి టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలి. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి, భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలి.
* తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ర్ట రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయండి. జగిత్యాల- దిండి మల్లేపల్లి భువనగిరి- చౌటుప్పల్ అమన్‌గల్ -షాద్‌నగర్- సంగారెడ్డి మరికల్- నారాయణపేట రామసముద్ర, వనపర్తి- కొత్తకోట -గద్వాల మంత్రాలయం, మన్నెగూడ, -వికారాబాద్‌ొ -తాండూరు -జహీరాబాద్ -బీదర్, కరీంనగర్ -సిరిసిల్ల- కామారెడ్డి ఎర్రవల్లి ఎక్స్‌రోడ్ రాయచూర్, కొత్తపల్లి- జనగాం- హైదరాబాద్, సారపాక- దుద్దెడ- కొమురవెల్లి రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- -కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలి.