ఇద్దరు కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేసినందుకుగానూ తక్షణమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు గురువారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు కాంట్రాక్టర్లు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. అక్కడే ఉన్న పోలీసులు, మిగతా కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు సాయికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు స్పందించిన కమిషనర్ ఇలంబర్తి ప్రతినిధులతో మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్న రూ.900 కోట్లను తక్షణమే చెల్లించాలని కమిషనర్‌ను కోరారు.
లేదంటే, ఈ నెల 20 నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా అభివృద్ధి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ వారంలో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు ధర్నాను విరమించారు.