24-04-2025 01:59:42 AM
సీఎంకు బహిరంగ లేఖ రాసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఏసీ ప్రతినిధులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23(విజయక్రాంతి): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని, వారి డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయాలని టీజీయూసీటీఏ(తెలంగాణ రాష్ట్ర యూనివర్సి టీల కాంట్రాక్ట్ టీచర్స్) జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె ఐదో రోజు కొనసాగింది.
ఈ సందర్భంగా బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ కాలేజీ నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, ఆర్జీయూకేటీ, అంబేద్కర్, తదితర యూనివ ర్సిటీల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులు తరలివచ్చారు. సమ్మె సందర్భంగా ఆయా యూనివర్సిటీల్లోనూ దీక్షలు, నిరసన కార్యక్రమాలను కొనసాగించారు.
ఓయూ పరిపాలన భవనం ఎదుట టెంట్ వేయడానికి అనుమతించకపోవడంతో ఎండలోనే దీక్ష కొనసాగించారు. దీక్షకు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడాలని, అప్పటివరకు తాను మద్దతుగా ఉంటానన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ దృష్టికి తీసుకెళుతానన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి, పీవోడబ్ల్యూ సంధ్య, జేఏసీ నాయకులు డా.పరశురాం, ధర్మతేజ, వేల్పుల కుమార్, ఉపేందర్, విజయేందర్‌రెడ్డి, తాళ్లపల్లి వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
క్రమబద్ధీకరించాలని సీఎం లేఖ
రాష్ట్రంలోని 12యూనివర్సిటీల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. 15నెలలుగా రాష్ట్ర ప్రబుత్వానికి విజ్ఞాపనలు చేశామని, ఆందోళనలు నిర్వహించామని అందులో పేర్కొన్నారు.
న్యాక్ గుర్తింపు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంక్ తదితర అంశాల్లో యూనివర్సిటీలను గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టేందుకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తమ సమస్యకు పరిష్కారం చూపుతారనే ఆశతో ఉన్నట్లు లేఖలో వివరించారు.