calender_icon.png 21 April, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండోరోజుకు కాంట్రాక్టు ప్రొఫెసర్ల సమ్మె

21-04-2025 01:29:57 AM

యూనివర్సిటీల్లో పరిపాలన భవనాల ఎదుట ధర్నాలు

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల నిరవధిక సమ్మె రెండోరోజు కూడా కొనసాగింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అన్ని యూనివర్సిటీలలో అధ్యాపకులు అధికారిక పరిపాలన భవనాల ఎదుట, ప్రధాన గేట్ల ముందు సమ్మె కొనసాగించారు. తమ ఉద్యోగ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, ఆ తర్వాతే యూనివర్సిటీలలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు.

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీలతోపాటు జేఎన్టీయూ మంథని, త్రిబుల్ ఐటీ బాసరలో సమ్మెను కొనసాగించారు. త్రిబుల్‌ఐటీ బాసరలో అధ్యాపకులు వినూత్నంగా ఖాళీ కుర్చీలలో ‘ఎంప్టీ చైర్స్, ఎంప్టీ ప్రామీసెస్’ అంటూ రాసిఉన్న ప్లకార్డులు ఉంచి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ నిరసన తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకులు తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని, అధికారులు దయచేసి సీఎం గారికి తప్పుడు సమాచారం ఇవ్వవద్దని, తమ రెగ్యులరైజేషన్ కోసం సహకరించాలని నినాదాలు చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో అధ్యాపకులు కుటుంబ సభ్యులు, పిల్లలతో సహా సమ్మెలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులు అధికారులు టెంటు వేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల పరిపాలన భవన ముందు నేలపైనే కూర్చుని సమ్మెను కొనసాగించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ.. దాదాపు 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని, చాలీచాలని జీతాలతోనే కాలం వెల్లదీస్తున్నామని చెప్పారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా లేదని చెప్పారు. ఎవరైనా పొరపాటున చనిపోతే వారి కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవలే 47 మంది రిటైర్ అయ్యారని, 14 మంది అధ్యాపకులు చనిపోయారని, వారి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వంగానీ, యూనివర్సిటీల నుంచి గాని ఇవ్వలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా తమ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేయాలి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ బెరవకుండా కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమ్మెను కొనసాగించారు.