లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్ నాయక్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని ఈనెల 29 ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెగ్యులర్ చేస్తామని మభ్యపెట్టి మోసం చేశారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను గుర్తించి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల ఎర్రయ్య ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలోనీ గిరిజన శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసిన తర్వాతనే గిరిజన శాఖలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన గురుకులంలో ఔట్సోర్సింగ్, స్లీపింగ్ సానిటేసన్, క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలో కాంటిజేన్సీ వర్కర్స్, డైలీ వేజ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులు ఇప్పించాలని, ప్రమాదవశత్తు చనిపోతే రూ.50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సంఘం జిల్లా అధ్యక్షులు కొమురెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి జర్పుల విజేశ్, అత్రం పెంటయ్య, శంకర్ దేవ్, లావుడియా రమేష్, శ్రీనివాస్, ప్రకాష్ రాథోడ్, గురుకులం బోధనేతర సంఘం నాయకులు బక్కయ్య, గోగుల నగేష్, ఆడ వెంకటేష్, బండి వెంకటేష్, ఉపాధ్యాయులు, బోధ నేతర ఉద్యోగులు పాల్గొన్నారు.