26-04-2025 12:51:40 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని పలువురు వక్తలు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె శుక్రవారం ఏడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వివిధ చోట్ల జరిగిన నిరసన కార్యక్రమాల్లో పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు.
ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ఎదురుగా మెయిన్‌రోడ్‌పై మానవహారం నిర్వహించారు. అనంతరం స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో దేవత విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాసం మాట్లాడుతూ కొందరు అధికారులు పైరవీలతో పదవిలోకి వస్తారని, వచ్చాక తమ ఉనికి మర్చిపోయి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తారని విమర్శించారు.
పదవిని అడ్డుపెట్టుకొని అణచివేయాలని చూస్తారన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల బోధనా సర్టిఫికెట్లకు యూజీసీ గుర్తింపునిచ్చినపుడు, వారి బోధనకు ప్రభుత్వమెందుకు గుర్తింపునివ్వదని ప్రశ్నించారు. వెంటనే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మెకు ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల విధానాలే కాంట్రాక్ట్ అధ్యాపకులకు శాపంగా మారాయన్నారు. ఏండ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమాల్లో డా. ధర్మతేజ, డా.పరశురాం, డా.కుమార్, డా.ఉపేందర్, డా.విజయేందర్‌రెడ్డి, డా.తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డా.వినీత పాండే, డా.శైలజరెడ్డి, డా.నసీమాబేగం, డా.పాండయ్య, డా.రవికుమార్, డా.శ్రీనివాస్, డా.శ్రీధర్‌కుమార్ లోథ్, డా.పీ కర్ణాకర్‌రావు, డా.సంకినేని వెంకన్న, డా.రవీందర్, డా.సాదు రాజేశ్, డా.నిరంజన్, డా.అంజన్‌రావు, డా.జూల సత్య పాల్గొన్నారు.