22-04-2025 01:22:28 AM
వీసీ వైఖరికి నిరసనగా రేపు చలో ఓయూ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రి ల్ 21 (విజయక్రాంతి): తమను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన సమ్మె సోమ వారం మూడో రోజు కొనసాగింది. ఈ సమ్మెలో భాగంగా ఉస్మాని యా యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫసర్లు నిరసన తెలిపారు. ఏండ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు.
సోమవారం మధ్యా హ్నం పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకు అనుమతి లేదని అసిస్టెంట్ ప్రొఫె సర్లను అరెస్ట్ చేశారు. ఓయూలో అరెస్టులకు నిరసనగా కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఓయూ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఓయూలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న తమను వీసీ అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
తాము శాంతియుతంగా సమ్మె చేసుకునేందుకు ఓయూ వీసీని లిఖితపూర్వకంగా అనుమతి అడిగినా, ఇప్పటి వరకు ఆయన సమాధానమివ్వలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో వీసీలు అనుమతిచ్చినా.. ఓయూ వీసీ ఒక్కరే అనుమతి ఇవ్వకుండా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
ఓయూ వీసీ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం ఓయూకు తరలివస్తార న్నారు. ఓయూ వీసీ మొండి వైఖరి, నియంతృత్వ ధోరణికి నిరసనగా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరశురాం, డాక్టర్ వేల్పుల కుమార్, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విజయేందర్‌రెడ్డి, డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీధర్‌లోథ్ హెచ్చరించారు.