08-04-2025 11:24:01 PM
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు నిరంతర కృషి..
పూర్తిగా నిర్మూలించేవరకు దాడులు కొనసాగుతాయి..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ నిరంతర కృషి చేస్తోంది. అందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ ధూల్‌పేట్‌లో 250 రోజుల్లో 102 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 327 మందిని ఎక్సైజ్ పోలీసులు రిమాండ్‌కు పంపించారు. 13 మందిని బౌండోవర్ చేయగా, మరో 85 మంది పరారీలో ఉన్నారు. ఈ అన్ని కేసుల్లో కలిపి 401 కేజీల గంజాయిని పట్టుకుని, 147 మొబెయిళ్లను, 58 బెక్‌లను, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై పీడీ యాక్ట్ పెట్టారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న పలువురు లేడీ డాన్ల అరెస్టు, అంతర్రాష్ట్ర ఒరిస్సా గంజాయి సరపరా దార్ల అరెస్టుతో ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేకతను చాటుకున్నారు.
కాగా గంజాయి నియంత్రణలో భాగంగా గతేడాది జూలై 17న చేపట్టిన ఆపరేషన్ ధూల్‌పేట్‌తో మంచి పలితాలు రాబట్టామని, అక్కడ 90 శాతం విక్రయాలను నిర్మూలించామని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. కాగా ఆపరేషన్ ధూల్‌పేట్ చేపట్టాక ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాలా మంది గంజాయి విక్రేతలు గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాలకు పారిపోయి అక్కడక్కడ కొద్దిపాటిగా గంజాయి అమ్మకాలు కొనసాగించడం ప్రారంభించారు. వారిని నియంత్రించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్‌లను ప్రారంభించారు. కగా ధూల్‌పేట్‌లో గంజాయి అమ్మకాలు 90 శాతంగా తగ్గి పోయాయని, పూర్తిగా నిర్మూలించేవరకు దాడులు కొనసాగుతాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.