calender_icon.png 18 October, 2024 | 5:50 AM

కొనసాగిన రికార్డు ర్యాలీ

26-09-2024 12:09:23 AM

కొత్త గరిష్ఠాలకు సూచీలు

పవర్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

ముంబై, సెప్టెంబర్ 25: అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో భారత్ ప్రధాన స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ  బుధవారమూ కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 85,000 పాయింట్ల పైన, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,000 పాయింట్లపైన తొలిసారిగా ముగిసాయి.

ఈ స్థాయిల్ని క్రితం రోజు ఇంట్రాడే లో సూచీలు అధిగమించినప్పటికీ, ఆ దిగువనే ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా పీపుల్‌స బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్‌కు ఊతమిచ్చింది. ఇంట్రాడేలో కొద్దిపాటి ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, చివరిగంటలో కొనుగోళ్లు జరపగడంతో సూచీలు కొత్త రికార్డు స్థాయిల్ని అందుకున్నాయి.

బుధవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో సెన్సెక్స్ 333 పాయింట్లు పెరిగి 85,247 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకి కొత్త రికార్డును నెలకొల్పింది  చివరకు 255  పాయింట్ల లాభంతో 85,169 పాయింట్ల వద్ద ముగిసింది.  ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 26,033 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.

చివరకు 63 పాయింట్ల లాభంతో 26,004 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. పవర్, బ్యాంకింగ్ షేర్ల అండతో ప్రధాన సూచీలు ట్రేడింగ్ ముగింపులో పెరిగాయని, అధిక విలువల కారణంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో కరెక్షన్ జరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. 

పవర్‌గ్రిడ్ టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో 20 షేర్లు లాభపడ్డాయి.  అన్నింటికంటే అధికంగా పవర్ గ్రిడ్  3.9 శాతం పెరిగి రూ.364 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 2.5 శాతం వరకూ పెరిగాయి. 

మరోవైపు టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,  హిందుస్థాన్ యూనీలీవర్‌లు 1.5 శాతం వరకూ తగ్గాయి.

వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 0.99 శాతం పెరిగింది.  పవర్ ఇండెక్స్ 0.87 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.47 శాతం, మెటల్ ఇండెక్స్ 0.40  శాతం,టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 0.24 శాతం, కమోడిటీస్ సూచి 0.23 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 0.47 శాతం చొప్పున లాభపడ్డాయి. సర్వీసెస్,  కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్స్ సూచీ లు నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.35 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం చొప్పున తగ్గాయి.