calender_icon.png 22 December, 2024 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగింపా.. విలీనమా?

22-12-2024 12:48:14 AM

  • మేడ్చల్ జిల్లాలోని 33 పంచాయతీలపై వీడని సందిగ్ధం
  • రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీల ఏర్పాటు
  • జిల్లాలో ఏర్పాటు చేయని సర్కార్
  • లోకల్ ఎన్నికలకు ఏర్పాట్లు

మేడ్చల్, డిసెంబర్ 21(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో ఉన్న 33 గ్రామ పంచాయతీలు కొనసాగుతాయా లేదా పురపాలక శాఖలో విలీనమవుతాయా అనే విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 61 గ్రామపంచాయతీలుండగద వాటిలో 28 గ్రామ పంచాయతీలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో విలీనం చేసింది. ఇంకా 33 గ్రామ పంచాయతీలు మిగిలాయి. నాలుగు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటు చేసి ఈ గ్రామాలన్నింటినీ విలీనం చేస్తారని ప్రచారం జరిగింది.

కాగా శుక్రవారం ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులువ్వగా.. మేడ్చల్ జిల్లాలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లాలో కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనందున పంచాయతీల కొనసాగింపుపై పీఠముడి వీడలేదు. దీంతో స్థానిక నాయకులు అయోమయానికి గురవుతున్నారు.

జిల్లాను విస్తరిస్తారా?

జిల్లాలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయకుంటే మూడు జడ్పీటీసీలతో జిల్లా పరిషత్ కొనసాగడం సాధ్యం కానందున జిల్లాను విస్తరిస్తారా అనే చర్చ జరుగుతోంది. వీటిని ఇతర జిల్లాలో కలుపుతారనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని, జిల్లాల పరిధులు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గమై న కొడంగల్‌ను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు ముక్కలు చేసినందున అందుకు ప్రతిగా గజ్వేల్ నియోజకవర్గాన్ని విభజించి మేడ్చల్‌లో కలుపుతారన్న ప్రచారమూ జరుగుతోంది. బీబీనగర్, బొమ్మల రామారం, ములుగు, మనోహరాబాద్ మండలాలను మేడ్చల్ జిల్లాలో కలపాలని అధికారులు ప్రతిపాదించుకున్నాప్పటికీ ఆ తర్వాత విరమించుకున్నారు.

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు 

అధికారులు పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు లేనందున అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు. ఓటరు జాబితాను సిద్ధం చేశారు.

మిగిలింది మూడు మండలాలే..

మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం మూడు మండల పరిషత్‌లు మాత్రమే మిగిలాయి. గతంలో మేడ్చల్, శామీర్‌పేట్, మూడు చింతలపల్లి, కీసర, ఘట్‌కేసర్ మండలాలుండేవి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. దీంతో కీసర, ఘట్ కేసర్ మండలాలలోని గ్రామాలన్ని సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. భవిష్యత్తులో జీహెచ్‌ఎంసీని రింగు రోడ్డు వరకు విస్తరిస్తే సమీపంలోని మున్సిపాలిటీలన్నీ విలీనమవుతాయి. 33 గ్రామాలు రింగు రోడ్డుకు దూరంగా ఉన్నాయి.

మేడ్చల్ మండలంలో 13, శామీర్ పేట్ మండలంలో 7, మూడు చింతలపల్లిలో 13 గ్రామ పంచాయతీలు మిగిలాయి. మూడు జడ్పీటీసీలతో జిల్లా పరిషత్ కొనసాగే అవకాశం లేదు. రాష్ట్రంలో కొన్ని మండలాల్లో కేవలం మూడు ఎంపీటీసీలు మాత్రమే ఉండగా, వాటిని ఐదు స్థానాలకు పెంచడానికి కసరత్తు జరుగుతోంది. మూడు స్థానాలున్న మేడ్చల్ జిల్లా పరిషత్‌పై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.