* అన్నిచోట్ల వామపక్షాలతో కలిసి నడుస్తాం
* బీఆర్‌ఎస్ మాదిరే కాంగ్రెస్ పాలన
* సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం పెరగడం వల్లే తాము ప్రజాక్షేత్రంలో గెలవలేకపోతున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని.. వామపక్షాలతో మాత్రం కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. బుధవారం టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌జేయూ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందని, బీఆర్‌ఎస్‌ను ఏ మాత్రం తీసిపోవడం లేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో సర్కార్ పూర్తిగా వైఫలమైందని విమర్శించారు. బీజేపీ, ఎంఐఎం రెండు మతోన్మాద పార్టీలేనని స్పష్టం చేశారు. కార్మిక, వ్యవసాయ, సామాన్యుల వ్యతిరేక బడ్జెట్ తీసుకొచ్చారని.. వ్యవసాయ రంగాన్ని సైతం కార్పోరేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని వెస్లీ అన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీలకు కేటాయింపుల్లో కోత విధించారని.. బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులే లేవన్నారు. విద్య, వైద్యంపై కేంద్ర నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూలీలు, కార్మికులు, రైతాంగానికి, పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తామన్నారు.
మతోన్మాద పార్టీలపై బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన వైఖరి లేదని.. ఈ అంశంలో వారి వైఖరి ఏంటో స్పష్టం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే.. కాంగ్రెస్ సర్కార్ చేసిన సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గినట్టు చూపారని అంతా భావిస్తున్నారన్నారు. వ్యక్తిగత దూషణలు తప్ప అసెంబ్లీలో ఫలప్రదమైన చర్చ జరగడం లేదన్నారు.