8న స్వామి శివానంద జయంతి :
“ఎవరైనా చేసిన గాయాన్ని వెంటనే చిన్న పిల్లల్లా మర్చిపోండి. దానిని ఎప్పుడూ హృదయంలో ఉంచుకోవద్దు. అది ద్వేషాన్ని రేకెత్తిస్తుంది.”
ఉత్తమమైన ఈ జీవన సందేశాన్ని ఇచ్చింది ప్రసిద్ధ భారతీయ ఆధ్యాత్మిక, యోగా గురువు శివానంద సరస్వతి. వీరి అసలు పేరు కుప్పుస్వామి. సన్యాస దీక్ష తర్వాత శివానంద సరస్వతిగా మారారు. ఆయన ఇంకా ఇలా అన్నారు.
“తృష్ణకు అంతం లేదు. అందువల్ల సంతృప్తి ఒక్కటే సంతోషానికి ఉత్తమ మార్గం. ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేయండి. నిస్వార్థంగా ఉండండి. మానసికంగా ప్రతిదీ తొలగించి స్వేచ్ఛగా జీవించండి. ఇది దైవిక జీవితం. ఇది మోక్షానికి ప్రత్యక్ష మార్గం. మీ స్వాభావిక స్వభావం ఆనందం. ఆనందమే శాశ్వతమైంది. ఇది యోగా, వేదాంత సందేశం.”
స్వామి శివానంద రుషికేశ్ వద్ద గంగానది ఒడ్డున శివానంద ఆశ్రమాన్ని స్థాపించి, వేదాంతాన్ని ప్రచారం చేశారు. శివానంద సరస్వతి 1887 సెప్టెంబర్ 8న తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి జిల్లాలోని పట్టమడైలో జన్మించారు.
సన్యాస దీక్ష స్వీకరించడానికి ముందు చాలా ఏండ్లు వైద్యుడిగా బ్రిటిష్ మలయాలో పనిచేశారు. ఆయన 1936లో ‘డివైన్ లైఫ్ సొసైటీ’ (డీఎల్‌ఎస్), 1948లో ‘యోగా- వేదాంత ఫారెస్ట్ అకాడమీ’లను స్థాపించారు. రిషికేశ్ నుండి 3 కి.మీ. దూరంలో శివానందనగర్ వద్ద గంగానది ఒడ్డున డీఎల్‌ఎస్ ప్రధాన కార్యాలయమైన ‘శివానంద ఆశ్రమం’ ఉంది. యోగా, వేదాంత విషయాలపై 200లకు పైగా పుస్తకాలు రచించారు శివానంద స్వామి. 75 ఏండ్ల వయసులో 1963 జూలై 14న నిర్యాణం చెందారు.