17-04-2025 11:06:52 PM
లీకేజీని గుర్తించి మరమ్మతు చేసిన జలమండలి సిబ్బంది..
హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): జలమండలి ఓఅండ్‌ఎం డివిజన్ రెడ్‌హిల్స్‌లోని పుట్లిబౌలిలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా అవుతున్న కలుషిత నీటి సరఫరాను జలమండలి అధికారులు, సిబ్బంది అరికట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ పుట్లిబౌలి ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు ప్రజలు జలమండలికి ఫిర్యాదు చేశారు. కానీ పైప్‌లైన్ ఎక్కడ లీకైందో గుర్తించేందుకు అధికారులు శ్రమించాల్సి వచ్చింది. చివరికి పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మిషన్ సాయంతో ట్రంక్ మెయిన్‌లోకి కెమెరాలు పంపి పైప్‌లైన్ దెబ్బతిన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. పుట్లిబౌలి చౌరస్తా వద్ద నాలాలోంచి నిర్మించిన 350ఎంఎం డయా సీఐట్రంక్ మెయిన్ పైప్ శిథిలమైనట్లు నిర్ధారించారు. కాగా పైప్‌లైన్ లీకేజీ అయిన ప్రాంతం ప్రధాన రోడ్డుకు మధ్యలో ఉండడం, నిత్యం రద్దీగా ఉండేది కావడంతో ట్రాఫిక్, లాఅండ్‌ఆర్డర్ పోలీసుల సాయంతో మూడు రోజులు రాత్రింబవళ్లు పనులు చేపట్టి కలుషిత నీటి సరఫరా సమస్యను పరిష్కరించారు. కలుషిత నీటి సరఫరాను అరికట్టి, సమస్యను పరిష్కరించిన అధికారులు, సిబ్బందిని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లోనూ ఇలాగే కష్టపడి పని చేయాలని సూచించారు.