21-03-2025 12:46:40 AM
ఏపీఎల్ అపోలో కంపెనీ నిర్వాహకం
చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
చేగుంట, మార్చ్ 20; పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్థాలు, కాలుష్యం వల్ల బోరు బావుల నుండి కలుషితమైన నీరు రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో ఉన్న ఏపియల్ అపోలో పరిశ్రమ నుండి వెలువడుతున్న వ్యర్ధ కెమికల్స్ ను పరిశ్రమ యాజమాన్యం అండర్ గ్రౌండ్ లో బోరు ద్వారా భూమిలోనికి వీడువడం ద్వారా, వడియారం గ్రామం, పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని బోర్లలో నీరు కలుషితమై వ్యవసాయ బోర్ల నుండి కెమికల్ నీళ్లు రావడం జరుగుతుందని ఆరోపించారు. అట్టి బోర్ నుండి వచ్చే నీరుని తాగడానికి కూడ ఉపయోగకరంగా లేకుండా, అటు వ్యవసాయానికి ఉపయోగించలేకపోతున్నారు.
ఈ నీటి వల్ల బోరు బావులు కింద ఉన్న కొన్ని ఎకరాల వ్యవసాయ భూములు బీటు భూములుగా మారుతున్నాయని అన్నారు, పరిశ్రమలు గ్రామ సమీపంలో ఉండడం వల్ల పరిశ్రమల నుండి వెలువడుతున్న దుర్గంధం, వ్యర్ధాల వల్ల గ్రామంలో, పరిసర ప్రాం తంలో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులు అనేకమైన శ్వాస సంబంధిత, వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పరిశ్రమపైన కాలుష్య నిర్ధారణ అధికారులు చర్యలు చేపట్టాలని, జిల్లా అధికారులకు లిఖిత పూర్వకంగా గ్రామస్తులు మాజీ ఉపసర్పంచ్ గిరి గౌడ్, ఎంపీటీసీ డాక్టర్ రమేష్ లక్ష్మి, బిజెపి దుబ్బాక కన్వీనర్ గోవింద్, రామకృష్ణ, నర్సిములు, బాలయ్య, లక్ష్మీ నారాయణ ఫిర్యాదుచేశారు.
అధికారులు పట్టించుకోవడం లేదు..
పరిశ్రమ వల్ల వ్యవసాయదారులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయంలో ఎన్నిమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా పారిశ్రామిక కాలుష్య నియంత్రధికారి తగు చర్యలు తీసుకోవాలి.