calender_icon.png 13 October, 2024 | 9:53 AM

వినియోగ షేర్లు ర్యాలీ

22-08-2024 12:30:00 AM

మరో 102 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై, ఆగస్టు 21: ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్, హెల్త్‌కేర్ షేర్లలో జరిగిన భారీ కొనుగోళ్లతో  భారత స్టాక్ సూచీలు మరింత ముందుకు కదిలాయి. బుధవారం రోజంతా పరిమితశ్రేణిలో కదిలిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగింపు సమయంలో పుంజకుని లాభాలతో ముగిసింది. మరొ 102 పాయింట్లు పెరిగి 80,905 పాయింట్ల వద్ద నిలిచింది. మంగళవారం ఈ సూచి 378 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఇదేబాటలో వరుసగా ఐదో రోజు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో 71 పాయింట్లు లాభపడి  24,770 పాయింట్ల వద్ద ముగిసింది.

యూఎస్ ఫెడ్ కమిటీ మినిట్స్ కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నందున సూచీల లాభాలు పరిమితంగా ఉన్నాయని ట్రేడర్లు తెలిపారు. దేశీయ సంస్థల పెట్టుబడుల మద్దతుతో మార్కెట్ పాజిటివ్‌గా ముగిసిందని, కన్జూమర్, ఎఫ్‌ఎంసీజీ, కమోడిటీస్, ఫార్మా రంగాలకు పోర్ట్‌ఫోలియోలను షిఫ్ట్ చేసుకున్నారని తెలిపారు. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు నష్టాలతో, సియోల్ లాభాలతో ముగిసాయి. యూరప్ మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. 

రేట్ల కోతకు అవకాశాలు ఎక్కువ

బుధవారం రాత్రి ఫెడ్ మినిట్స్ వెలువడనున్నందున గ్లోబల్ మార్కెట్లు ఆచితూచి ట్రేడయ్యాయని, యూఎస్‌లో ద్రవ్యోల్బణం బాగా తగ్గినందున ఫెడ్ రేట్ల కోతకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇటీవలి ఫెడ్ మీటింగ్ మినిట్స్‌తో పాటు జాక్సన్‌హోల్ ఎకానమిక్ సింఫోజియంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వడ్డీ రేట్లపై వెలువరించే సంకేతాలపై ఇన్వెస్టర్లు దృష్టి నిలిపారని స్టాక్స్‌బాక్స్ డెరివేటివ్ అనలిస్ట్ అవధూత్ బాగ్‌కర్ చెప్పారు. 

టైటాన్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టైటాన్ 2.5 శాతం పెరిగి రూ.3,560 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతి ఎయిర్‌టెల్‌లు 2 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు అల్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1.5 శాతం వరకూ తగ్గాయి.

వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.56 శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ సూచి 1.33 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.94 శాతం, మెటల్ ఇండెక్స్ 0.73 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 0.66 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.58 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.55 శాతం చొప్పున పెరిగాయి.రియల్టీ, పవర్, బ్యాంకెక్స్, యుటిలిటీస్ సూచీలు  తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.87 శాతం చొప్పున పెరిగాయి.