- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 28 (విజయక్రాంతి): ‘డబ్బులు కూడబెట్టి స్థలం కొని ఇల్లు కట్టుకుంటే అధికారులు కూల్చేశారు. ఈ వివాదం కోర్టులో ఉన్నా.. ధన బలం, రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు ఆ స్థలంలో ప్రహరీ నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.’ అని కొండపల్లి భారతి, కాటేపల్లి ప్రభావతి వాపోయారు.
బాధితుల కథనం మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని 817/79 గంధం సూర్యప్రకాశ్‌కు చెందిన 4ఎకరాల భూమిలో.. సుమారు 46 మంది 2002-03లో స్థలాలు కొని ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. పదేళ్ల తర్వాత (2013లో) భూ వివాదం తలెత్తడంతో కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించారు.
ఈక్రమంలో ఏడాదిన్నర క్రితం కొందరు వచ్చి అక్కడ నివాసం ఉంటున్న వారి ఇండ్లను కూల్చి ఆక్రమించుకున్నారు. దీంతో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ స్థల వివాదం కోర్టులో ఉన్నది. ఈ సమయంలో రాజకీయ నేపథ్యం ఉన్న కొందరు ఆ స్థలంలో ప్రహరీ నిర్మిస్తుండటంతో..
ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
ఈ విషయమై పాల్వంచ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రవికుమార్‌ను వివరణ కోరగా.. ఆ భూమిలో సర్వే చేయాల్సి ఉందన్నారు. సర్వే తర్వాతే ఎవరి భూమి ఎక్కడుంది అనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.