calender_icon.png 20 October, 2024 | 3:17 AM

పోలీస్ స్టేషన్ స్థలంలో నిర్మాణాలు

20-10-2024 12:38:35 AM

కేసు నమోదు

చార్మినార్, అక్టోబర్ 19: పోలీస్ స్టేషన్ కోసం కేటాయించిన స్థలంలో కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతుండటంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. శనివారం చార్మినార్ ఇన్‌స్పెక్టర్ కే చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పురా రెవెన్యూ అధికారులు చార్మినార్ పాత పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న 840 గజాల ప్రభుత్వ స్థలాన్ని 2002 సంవత్సరంలో టూరిజం శాఖకు కేటాయించారు. అయితే, 2004 సంవత్సరంలో ఖలేద్ హైమ్మద్‌తో పాటు మగ్బూల్ హైమ్మద్, బషీర్ హైమ్మద్, మహ్మద్ అలీ హైమ్మద్, మహ్మద్ ఫయ్యాజ్, నసీర్ అనే వ్యక్తులు స్థలం తమదంటూ కోర్టును ఆశ్రయించారు.

ఆ తర్వాత కోర్టు కేసును కొట్టేయడంతో టూరిజం శాఖ ఆధీనంలో ఉన్న స్థలాన్ని చార్మినార్ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారు. అయినప్పటికీ మరోసారి ఖలేద్ హైమ్మద్, ఆయన కుమారులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే,  ఈ నెల 5వ తేదీన చార్మినార్ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కొందరు వ్యక్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని పురావస్తు శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు 17వ తేదీన నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసును చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.