04-03-2025 11:32:17 PM
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి.
పంచాయతీలలో వందశాతం పనులు వసూలు చేయాలి.
జిల్లా అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష..
సంగారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా మార్కింగ్ చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 136821 మంది అర్హులుగా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. మంజూరు ఇచ్చిన ఇండ్లకు వెంటనే మార్కింగ్ చేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఎల్ఆర్ఎస్ డబ్బుల బ్యాలెన్స్ త్వరగా వసూలు చేయాలన్నారు. అన్ని గ్రామాలలో ఇంటి పన్నులు 100% వసూలు చేయాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని గ్రామాలలో ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా గ్రామీణ మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతిరోజు కనీసం 60 మందికి కొత్తపనులు ఉపాధి కల్పించేలా ఉపాధి పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ,పంచాయతీ సెక్రెటరీ అవసరమైన పనులు గుర్తించాలని ప్రజలకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ సిసి రోడ్లు అనుమతులు ఉన్న ఇతర రోడ్లు వేగవంతంగా పూర్తి చేయాలని ,పాఠశాలలకు ,ఎంపీడీవో కార్యాలయాలకు, ఆసుపత్రులకు, మండలాల్లోని కమ్యూనిటీ అవసరాలకు గుర్తించిన మంజూరైన రోడ్లను వేగవర్ధంగా పూర్తి చేయాలని అన్నారు.
మండల స్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులతో మిషన్ భగీరథ గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా పైప్లైన్లు డ్యామేజ్ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని. అన్ని గ్రామపంచాయతీలో మండల కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల నీటి తొట్టెలలో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు గురుకులాలలో సంక్షేమ వసతి గ్రహాలలో ప్రతినెల తప్పనిసరి తనిఖీలు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వసతి గృహాలు, గురుకులాలలో కూరగాయల స్టోరేజ్ పై పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. గురుకులాలు సంక్షేమ వసతి గృహాలు పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ సెక్రటరీలు ఈ విషయంలో గురుకులాలు వసతి గృహాల సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జడ్పీసీఈఓ జానకిరెడ్డి, డిపిఓ సాయిబాబా, పిడి హౌజింగ్ చలపతి రావు, జిల్లాలోని ఎంపీడీవోలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.