21-03-2025 02:00:43 AM
పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేలు
యాదాద్రి భువనగిరి , మార్చి 20 (విజయ క్రాంతి): ప్రతిష్టాత్మక ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా పనులకు తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు గురువారం ముగ్గు పోసి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, తో కలసి ఇండ్ల నిర్మాణ పనులకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు.
కార్యక్రమం లో భాగంగా గ్రామం లో ఉన్నా చల్ల కవిత, కురుమెటి ధనమ్మ ఇండ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన రచ్చబండ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలైన లబ్ధిదారులందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తుందని వెంటనే నిర్మాణాలు ప్రారంభించి తొందరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.
నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులందరూ సకాలంలో నిర్మాణపు పనులు చేపట్టి ఇళ్ల ను నిర్మించుకునేందుకు తోడ్పాటు అందించాలని అధికారులకు సూచించారు. రచ్చ బండ లో గ్రామ ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎక్స్ రోడ్ లోనే ఆగుతున్నాయని ఊర్లో ఆగడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. SC కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలని గ్రామ ప్రజలు కోరారు.
ఊర్లోకి వచ్చే కాలువపై బ్రిడ్జి చిన్నగా ఉండటం వల్ల తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నామని దీన్ని వెడల్పు చేయాలని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ విజయ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ పెలపూడి వెంకటేశ్వర్లు ,మండల ప్రత్యేక అధికారి యాదయ్య , ఎంపీడీవో బాలాజీ, గ్రామ ప్రత్యేక అధికారి కీర్తి, మండల అగ్రికల్చర్ అధికారి తహసీల్దార్ రాంప్రసాద్, ఎండిఓ పైళ్ల జనార్దన్ రెడ్డి ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఏపీవో కరుణాకర్, ఏపీఎం వెంకటేశ్వర్లు,పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.