26-03-2025 01:10:04 AM
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, మార్చి 25 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ గ్రౌండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూర్, సారంగాపూర్ మండలాల్లో మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ పలు నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
బీర్పూర్ మండల కేంద్రంలోని పీహెచ్ హెల్త్ సబ్ సెంటర్, బీర్పూర్ మండలం చిత్రవేణి గూడెంలో ఇదిరమ్మ ఇండ్లు, తాళ్ళ ధర్మారంలో హెల్త్ సబ్ సెంటర్, కొల్వాయి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ దశలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
బీర్పూర్ మండల కేంద్రంలో రూ. 1 కోటి 43 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హెల్త్ సెంటర్, తాళ్లధర్మారంలో రూ. 20 లక్షలతో సబ్ సెంటర్, రూ. 20 లక్షల వ్యయంతో కొల్వాయిలో హెల్త్ సబ్ సెంటర్, సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో రూ. 20 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు.
సారంగాపూర్ మండలంలో నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ రెండు నెలల లోపు పూర్తి చేయాలని, అలాగే తాళ్ల ధర్మారంలో హెల్త్ సబ్ సెంటర్ పనులను ఏప్రిల్ నెల చివరి వరకు పూర్తిచేయాలన్నారు. కొల్వాయి గ్రామం సబ్ సెంటర్ పనులను 20 రోజుల్లో లోపు పూర్తిచేయాలని, లక్ష్మీదేవిపల్లిలోని గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ పనులను ఏప్రిల్ నెల చివరి నాటికి నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం బీర్పూర్ మండలం చిత్రవేణి గూడెంలోని ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ స్థలాల పనుల పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం మాత్రమే నిర్మించుకోవాలని, నిర్మించుకున్న వారికి మాత్రమే దశలవారీగా ప్రభుత్వ నిధులు మంజూరవుతాయని కలెక్టర్ సూచించారు.
ఇండ్ల నిర్మాణ దశలోని పనులను వేగంగా పూర్తి చేసేలా సదరు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ వెంట డిపిఓ మధన్ మోహన్, డిఈ మిలింద్ హౌసింగ్ డిఈ, ఎమ్మార్వో, సంబంధిత శాఖల అధికారులున్నారు.