calender_icon.png 2 November, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని నిర్మాణం.. అధికారుల సహకారం

02-11-2024 02:25:43 AM

  1. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో అక్రమంగా జీ ప్లస్ త్రీ నిర్మాణం
  2. మిన్నకుండిపోయిన అధికారులు

రాజేంద్రనగర్, నవంబర్ 1 : అనుమతులు లేని నిర్మాణాలు ఎన్ని వెలుస్తున్నా అధికారుల తీరు మారడం లేదు. అధికారుల సహకారంతోనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నా తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై సన్‌సిటీ వద్ద మరో అక్రమ నిర్మాణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి సుమారు 100 గజాల స్థలంలో టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టాడు.

అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి తొలుత సెల్లార్ నిర్మాణం.. ఆపై జీ ప్లస్ త్రీ అంతస్తుల నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగం సుమారు ఆరు నెలలుగా జరుగుతున్నా.. ప్రధాన రహదారిపై నిర్మాణం జరిగినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. 

నిబంధనలకు మంగళం

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. అనుమతులకు మించి అదనపు అంతస్తులు చేపట్టినా ఎప్పటికప్పుడు పరిశీలించి కూల్చివేతలు చేపట్టాలని నిబంధనలు ఉన్నా అధికారులు వాటికి మంగళం పాడుతున్నారు.

అనుమతులు లేవు అనుమతి లేని నిర్మాణంపై బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణిని వివరణ కోరగా.. సదరు నిర్మాణానికి ఎలాంటి అనుతులు లేవని స్పష్టం చేశారు. నిర్మాణదారుడికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. అయితే, అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా పనులు ఆపకుండా నిర్మాణం పూర్తి కావడం గమనార్హం.