calender_icon.png 21 September, 2024 | 11:17 AM

స్టడీస్ చేయకముందే కన్‌స్ట్రక్షన్ మొదలైంది

21-09-2024 02:16:56 AM

పీసీ ఘోష్ కమిషన్ ముందు ఒప్పుకున్న రిసెర్చ్ ఇంజినీర్లు

సమాధానాలు దాటవేసిన డ్యాం సేఫ్టీ సీఈ ప్రమీల

కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. శుక్రవారం తెలంగాణ రిసెర్చ్ అధికారులు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ డిజైన్స్ అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు. తెలంగాణ రిసెర్చ్ జాయింట్ డైరెక్టర్‌తో పాటు చీఫ్ ఇంజినీర్, ఇంజినీర్లు హాజరయ్యారు. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమా ధానాలు చెప్పలేక స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజినీర్ ప్రమీల తీవ్రంగా ఇబ్బంది పడ్డారని సమాచారం.

తనకు పూర్తిగా తెలియ దని, మర్చిపోయానని, గుర్తులేదని ఆమె సమాధానం ఇవ్వగా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్‌డీఎస్‌ఏ పరిధిలోకి వచ్చిన తర్వాత డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అని కమిషన్ ప్రశ్నించింది. ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ రిపోర్ట్ ఎవరు తయారుచేస్తారు.. ఎవరికిస్తారు అని సీఈ ప్రమీలను ప్రశ్నించింది. మూడు బరాజ్‌ల నిర్మాణానికి ముందు మాన్సూన్ రిపోర్ట్ ఇవ్వలేదని ఆమె కమిషన్ ముందు చెప్పింది. అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బరాజ్‌ల వద్ద డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అన్న ప్రశ్నలకు సరైన ఆమె సమాధానం చెప్పలేకపోయిందని సమాచారం.

కుంగుబాటుకు ముందు, తరువాత సైతం స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఎలాంటి నివేదికలు అందలేదని రీసెర్చ్ ఇంజినీర్లు కమిషన్ ముందు తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ, ఇండియన్ డ్యామ్ సేఫ్టీ నిబంధ నలు స్టేట్ డ్యాం సేఫ్టీ పాటిస్తుందా లేదా అని ప్రశ్నించగా.. ఫీల్డ్ లెవెల్ అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందలేదని డ్యామ్ సేఫ్టీ, సీడీవో ఉన్నతాధికారులు కమిషన్‌కు తెలిపారు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని ఇంజనీర్లు పేర్కొన్నారు. మొత్తం మూడు బరా జ్‌లలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే.. మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని కమిషన్‌కు ఇంజినీర్లు తెలిపారు.

అధ్యయనానికి ముందే కన్‌స్ట్రక్షన్

మూడు బరాజ్‌ల నిర్మాణానికంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అని పీసీ ఘోష్ కమిషన్ రీసెర్చ్ ఇంజినీర్లను ప్రశ్నించింది.కన్‌స్ట్రక్షన్‌కు ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజినీర్లు తెలిపారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే కన్‌స్ట్రక్షన్ మొదలైనట్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారు. మేడిగడ్డతోపాటు ఇతర ఆనకట్టలకు డ్యామేజ్ జరగ డానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లే అని కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజినీర్లు తెలిపారు.

వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు వారు కమిషన్‌కు తెలియచేశారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని రీసెర్చ్ అధికా రులు తెలిపారు. బరాజ్‌లు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్‌కి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మూడు బరాజ్‌లలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని రీసెర్చ్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం బరాజ్ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజినీర్ల దృష్టిలో ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. 

నాటి మంత్రివర్గ నిర్ణయాలు, తీర్మానాలు కావాలి

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత మంత్రివర్గం చేసిన తీర్మానాలతో పాటు క్యాబినెట్ రూల్ బుక్‌ను అందించాలని ప్రభుత్వాన్ని పీసీ ఘోష్ కమిషన్ కోరినట్లు తెలిసింది.