calender_icon.png 24 December, 2024 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డగోలుగా షెడ్ల నిర్మాణం

06-11-2024 02:19:08 AM

  1. ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో రెసిడెన్షియల్ ప్లాట్లలో షెడ్లు ఏర్పాటు 
  2. కొన్నిరోజుల క్రితం కూల్చివేతలు.. తిరిగి నిర్మాణాలు పూర్తి
  3. పట్టించుకోని అధికారులు

రాజేంద్రనగర్, నవంబర్ 5: అవి రెసిడెన్షియల్ ప్లాట్లు.. బై లాస్ ప్రకారం అక్కడ కేవలం నివాసం ఉండడానికి నిర్మాణాలు చేపట్టాలి. కానీ, అక్రమార్కులు నిబంధనలకు మంగళం పాడారు. టౌన్ ప్లానింగ్ అధి కారులకు అమ్యామ్యాలు సమర్పించడంతో పాటు నేతలకు కప్పం కడుతున్నారు. ఇంకేముంది దర్జాగా షెడ్లు నిర్మించారు. వాటిని అద్దెకు ఇచ్చి నెలకు లక్షల్లో గడిస్తున్నారు. 

అనుమతుల లేకుండా..

ప్రజాప్రతినిధులు, అధికారులకు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ డబ్బులు ఇచ్చే కల్పతరువుగా మారింది. కొందరు టౌన్‌ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మించి గోదాంలుగా వినియోగిస్తున్నారు. కొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. షెడ్ల యజమా నుల నుంచి కొందరు నేతలు నెలవారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇక్కడ పనులు ఆపిన అధికారులు తర్వాత ఏ మాత్రం పట్టించుకోలేదు. 

కూల్చినా.. తిరిగి నిర్మాణం

ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో సుమారు వెయ్యి ప్లాట్లు ఉన్నాయి. కేవలం ఇక్కడ రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టాలని బై లాస్ నిబంధనలు ఉన్నాయి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ అన్ని షెడ్లు వెలిశాయి. ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారు లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్నిరోజుల క్రితం టౌన్‌ప్లానింగ్ అధికారులు కొన్నింటిని కూల్చివేశారు.

అనంతరం అక్రమార్కులు కొద్దిరోజుల్లోనే తిరిగి షెడ్లు కట్టుకోవడం విస్తుగొలిపింది. ఇక నేతలు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా నిర్మాణదారులు డబ్బులు ఇవ్వకపోతే ఏదో విధంగా వాటిని కూల్చివేయిస్తున్నారు. కొందరు చోటామోటా లీడర్లు ‘మేం అన్న మనుషులం’ అంటూ బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.  

నోటీసులు ఇచ్చి కూల్చివేస్తాం  

ఇందిరాగాంధీ హౌసిం గ్ సొ సైటీలో షెడ్ల నిర్మాణం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. గతంలో ఇక్కడ కూల్చివేతలు చేపట్టా రు. తిరిగి మళ్లీ నిర్మించు కున్న ట్లు సమాచారం ఉంది. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ద్వారా వెంటనే నోటీసులు ఇచ్చి ‘ఎస్‌టీఎఫ్’ ద్వా రా త్వరలో కూల్చివే స్తాం. ఇక్కడ కేవలం రెసిడెన్షియల్ నిర్మాణా లు మాత్రమే చేపట్టాలి. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.  

 శ్రీధర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ, రాజేంద్రనగర్ సర్కిల్