calender_icon.png 11 October, 2024 | 8:49 PM

నిబంధనలకు విరుద్ధంగా రెండో అంతస్తు నిర్మాణం... చోద్యం చూస్తున్న అధికారులు

11-10-2024 06:31:26 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా కొత్తగూడెం పట్టణంలో రెండో అంతస్తు నిర్మాణం చేపడుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా 30వ వార్డు మధుర బస్తీలో అనుమతులకు విరుద్ధంగా సెట్ బ్యాక్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణం చేపడుతున్నయజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అనుమతులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనుమతులు లేకుండా సెల్లార్ నిర్మాణం చేపడుతున్న విషయంపై బీఎస్పీ ఆధ్వర్యంలో 5 నెలలుగా ఐదు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడం తప్ప చర్యలు తీసుకోకపోవడంతో పాటు రెండో అంతస్తు వరకు నిర్మాణం చేరుకొందని ఆయన తెలిపారు. జాతీయ రహదారిపై ఇసుక కంకర పోసి పాదచారులు వాహనదారులను ఇబ్బందులు గురిచేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి బస్టాండ్ ఎదురుగా జరుగుతున్న నిర్మాణంపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు సాయి, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవి కుమార్ శంకర్, మురళి పాల్గొన్నారు.