calender_icon.png 20 September, 2024 | 3:40 AM

అసైన్డ్ భూమిలో రిసార్ట్ నిర్మాణం

17-09-2024 12:44:41 AM

  1. వివాదంలో సదరు భూమి 
  2. పట్టా చూపుతూ అసైన్డ్ భూమి ఆక్రమణ 
  3. అధికారుల తీరుపై ఆరోపణలు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల పరిధిలో అనుమతులు లేకుండానే రిసార్ట్‌ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూము లు, చెరువుల బఫర్ జోన్లలో సైతం రిసార్ట్‌లు వెలుస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయి అనుమతులు ఉన్న రిసార్ట్‌లు నామమాత్రమే. ఇబ్రహీంపట్నం ఖల్సా సర్వే నంబర్ 1146 అసైన్డ్ భూమి వివాదంలో ఉందన్న కారణంతో అందులో సాగు చేసుకుంటున్న 120 మందికి పైగా ఉన్న రైతులకు గత 10 ఏళ్లుగా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదు.

అయితే, అక్కడ ఒక రిసార్ట్ ఏర్పడగా, దానికి అనుమతి ఎలా ఇచ్చారని రైతులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొంతకా లంగా నగరం నుంచి పర్యాటకుల రాక పెరగడంతో రిసార్ట్‌లు ఏర్పాటు చేసిన వారి దందా మూడు మువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. అనుకోని ఘటనలు ఏమై నా జరిగితే ఎవరు బాధ్యులని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

20 గుంటల భూమిని ఆక్రమించి..

మంగళ్‌పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో పట్టా భూమిని చూపి స్తూ దానికి ఆనుకొని ఉన్న అసైన్డ్ భూమి సర్వే నంబర్ 1146 లో దాదాపు 20 గుంట లు ఆక్రమించి ఐరా వ్యాలీ రిసార్ట్ నిర్మాణం చేపట్టారు. కాగా, ఈ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్నప్పుడే స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. కానీ దీనిపై అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించారని విమర్శలున్నాయి.

అధికారుల తీరుపై విమర్శలు..

సర్వే నంబర్ 1146 అసైన్డ్ భూమిలో ధరణి పాసుపుస్తకాలు, సక్సేషన్, ఇతర దరఖాస్తులకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసినా, సదరు భూమి వివాదంలో ఉం దంటూ.. ల్యాండ్ ఎక్సెస్ కారణం చూపుతూ రెవెన్యూ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కానీ, ఇదే సర్వే నంబర్‌లో ఇటీవల కొంతమందికి మాత్రంధరణి పాసుపుస్తకాలు ఇచ్చారు. అదేవిధంగా మరొకరికి రిసార్ట్ ఏర్పాటుకు సహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

10 ఏళ్లుగా జరగని న్యాయం..

సర్వే నంబర్ 1146లోని భూములకు ధరణి పాసుపుస్తకాలు రాకపోవడంతో గత 10 ఏళ్లుగా రైతుబంధు, రైతుబీమాకు అర్హత కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో చనిపోయిన రైతులకు రైతుబీమా ఉంటే కనీసం తమ కుటుంబాలకు ఆసరాగా అయినా ఉండేదని అంటున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ స్పందించి రైతులందరికీ న్యాయం జరిగేలా పాసుపుస్తకాలు అందజేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఇబ్రహీంపట్నం ఖాల్సా సర్వే నంబర్ 1146 అసైన్డ్ భూమి వివాదంలో ఉన్నమాట వాస్తవమే. ఆ కారణంతోనే రైతు లు ధరణి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పాసుపుస్తకాలు ఇవ్వడం ఇబ్బందిగా మారింది. అదేవిధంగా ఆ సర్వే నంబర్లలో రిసార్ట్ నిర్మాణం నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టకముందు జరిగింది. ఒకవేళ అసైన్డ్ భూమి ఆక్రమ ణకు గురైనట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. 

  సునీత, ఇబ్రహీంపట్నం తహసీల్దార్