07-03-2025 01:47:45 AM
‘మంత్రి తుమ్మల కృషితో బీసీ హాస్టల్ భవనాలు
‘ఖమ్మంలో 3 భవనాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్
‘ఒక్కో భవన నిర్మాణానికి రూ.3 కోట్లు చొప్పున
రూ. 9 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
‘ఆధునిక హంగులతో సరికొత్త భవనాల నిర్మాణం
‘త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల
ఖమ్మం, మార్చి 6 ( విజయక్రాంతి ): ఖమ్మం జిల్లాలో బీసీ విద్యార్థులకు మహర్దశ పట్టనుంది. శిధిలావస్థలో ఉన్న బిసి వెల్ఫేర్ హాస్టల్స్ స్థానంలో నూతన భవనాల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఖమ్మంలో మూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ భవనాలను మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో భవనానికి రూ. 3 కోట్ల చొప్పున మొత్తం మూడు భవనాలకు రూ. 9 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
ఒక్కో భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి ఎనలేనిది. హాస్టల్స్ శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు విద్యార్థుల అవస్థలను గమనించిన మంత్రి నూతన భవనాలకు ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు ఖమ్మం నియోజకవర్గంలో మూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తొమ్మిది కోట్ల వ్యయంతో ఈ మూడు భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రఘునాథపాలెం మండలం వి. వెంకటాయ పాలెంలో బిసి బాయ్స్ హాస్టల్స్, ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ లో గల బీసీ బాయ్స్ హాస్టల్-1, ఖమ్మం నగరంలోని జహీర్ పురాలోని బీసీ బాయ్స్ హాస్టల్-2 కు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఈ మూడు భవనాలను ఆధునిక హంగులతో సరికొత్త సాంకేతిక పద్ధతులతో నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి మంత్రి తుమ్మల త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. నూతన భవనాల నిర్మాణంతో బీసీ విద్యార్థులకు కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే నూతన మెనూ తో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సాంకేతిక హంగులతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటి నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు చేస్తున్నారు. బీసీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రగతి బాటలు వేసేలా మంత్రి ‘తుమ్మల‘కృషి చేయనున్నారు.