calender_icon.png 19 October, 2024 | 2:52 AM

నాలాను పూడ్చి షెట్టర్ల నిర్మాణం

19-10-2024 12:27:02 AM

  1. బండ్లగూడ జాగీర్ ప్రధాన రహదారిపై అక్రమ నిర్మాణం 
  2. అన్నీ తెలిసినా పట్టించుకోని అధికారులు 

రాజేంద్రనగర్, అక్టోబర్ 18: నాలాను దర్జాగా పూడ్చేశారు.. ఏంచక్కా కమర్షియల్ షెట్టర్లు నిర్మిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఇది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 60,70లో ఉన్న నాలా పరిస్థితి. బండ్లగూడ జాగీర్ నుంచి చేవెళ్ల వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న నాలాను కొందరు గుట్టుగా పూడ్చేసి కమర్షియల్ షెట్టర్ల నిర్మాణం చకచకా చేపడుతున్నారు. 

అనుమతులకు మంగళం

సుమారు వెయ్యి గజాలు ఉన్న ఈ స్థలంలో కొన్నిరోజులుగా కమర్షియల్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వారం పది రోజులుగా పనులు నిరంతరాయంగా నడుస్తున్నాయి.

అక్రమార్కులతో కుమ్మక్కు కావడంతోనే మున్సిపల్, రెవెన్యూ యం త్రాంగానికి నోరు మూతపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారు లు మేల్కొని అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

స్పందించని మున్సిపల్ కమిషనర్

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారనే విషయమై వివరణ కోరేందుకు పలుమార్లు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్రను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన స్పందించకపోవడం గమనార్హం. 

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

నాలా పూడ్చివేసి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. ఈ విషయమై సిబ్బందితో పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 

 శ్రీనివాస్ రెడ్డి, 

గండిపేట తహసీల్దార్