calender_icon.png 25 February, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధునాతన వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు

24-02-2025 08:19:07 PM

విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా వెల్లడి..

నిజామాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తేవడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా వెల్లడించారు. సోమవారం ఆమె రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలు, వసతుల కల్పన కోసం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపడుతున్నామని తెలిపారు.

ఇప్పటికే మంజూరీలు తెలుపబడిన ఆయా నియోజకవర్గాలలో సాధ్యమైనంత త్వరగా వీటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, పనుల నాణ్యత, అధునాతన వసతి సదుపాయాల కల్పనలో ఎంతమాత్రం రాజీ పడకూడదని సూచించారు. ఆయా నిర్మాణ దశలకు అనుగుణంగా, పక్కాగా పరిశీలన చేసిన మీదట నిధులు చెల్లించాలని అన్నారు.

అందరికి ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను అధునాతన సదుపాయాలతో అలరారేలా నిర్మాణాలు జరిపించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ, ఇప్పటికే జిల్లాలోని బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాలలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలకు మంజూరీలు లభించాయని, తక్షణమే పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.